మండలి రద్దు ఆపేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్న టీడీపీ

మండలి రద్దు ఆపేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్న టీడీపీ

మండలి రద్దు దిశగా జగన్‌ సర్కారు అడుగులు వేస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశానికి వెళ్లకూడదని టీడీఎల్పీలో నిర్ణయించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ నేతలు సమావేశమై భవిష్యత్‌ వ్యూహాలపై చర్చించారు. శాసన మండలిలో జరిగిన చర్చను శాసనసభలో చర్చించడాన్ని వారంతా తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని వారంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా శాసనసభలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వాటికి దూరంగా ఉండాలని టీడీపీ నేతలు డిసైడయ్యారు.

ఇక టీడీఎల్పీ సమావేశంలో రెండు సినిమా సన్నివేశాలను చూపించారు టీడీపీ సభ్యులు.. ప్రభుత్వ నిర్ణయాలను పోలుస్తూ వీడియోలు ప్రదర్శించారు. ఢిల్లీ నుంచి దౌల్తాబాద్‌కు రాజధానిని మార్చిన మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సినిమాతోపాటు ప్రజలను హింసించే 23వ రాజు పులికేసి సినిమా క్లిప్పింగులను ప్రదర్శించారు. సినిమా సన్నివేశాలను చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవ్వుకున్నారు. రాష్ట్రంలో పరిపాలన ఇదే విధంగా ఉందంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు.

అటు మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో పెద్దలసభను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు సీఎం జగన్.. సూచనప్రాయంగా స్పష్టం చేశారు. సోమవారం మంత్రివర్గం సమావేశం కాబోతోంది. శాసనమండలి ఉండాలా ? రద్దు చేయాలా? అనే అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 9.30 గంటలకు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో మండలి రద్దు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్‌లో మండలి రద్దు నిర్ణయం తీసుకుని.. ఆ వెంటనే దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించినా.. మండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయించడంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మండలి చైర్మన్, టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన సీఎం జగన్‌ అసలు మండలి అవసరమా ? అనే చర్చకు తెరలేపారు. సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని జగన్ ప్రకటించడంతో.. ఆ రోజే మండలి రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.

Tags

Next Story