నాకు అవమానం జరిగింది.. సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీ లేఖ
పశ్చిమ గోదావరి జిల్లా డీడీఆర్సీ సమావేశంలో తనకు చోటు కల్పించకపోవడంపై.. ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈమేరకు ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పార్లమెంట్ సభ్యుడినైన తనకు డీడీఆర్సీ సమావేశంలో స్థానం కల్పించకుండా అవమానించారని లేఖలో పేర్కొన్నారు. వేదికపై కాకుండా వేదిక కింద ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవాలని తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా డీడీఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి హాజరైన ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వేదికపై సీటు కేటాయించలేదు. దీంతో తనకు ఎందుకు సీటు కేటాయించలేదని నిర్వాహకులను ప్రశ్నిస్తే.. ఎంపీలకు వేదికపై సీట్లు కేటాయించలేదనే సమాధానం వచ్చింది. దీంతో జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని నాని కూడా ఎంపీలకు వేదికపై సీట్లు కేటాయించాలని సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఇక, తనకు వేదికపై సీటు కేటాయించకపోవడంపై మనస్తాపానికి గురైని ఎంపీ రఘురామకృష్ణం రాజు.. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కొద్దిసేపటికే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రమంత్రులను ఒకలాగా.. ఎంపీలను మరోలాగా ట్రీట్ చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కూడా అసహనం వ్యక్తం చేశారు.
డీడీఆర్సీ మీటింగ్ లో అవమానం జరిగడంపై స్పందించిన రఘురామకృష్ణం రాజు.. ఇది తనకు జరిగిన అవమానం కాదని.. తమను ఎంపీలుగా ఎన్నుకున్న ప్రజలకు, పార్లమెంటరీ వ్యవస్థకు జరిగిన అవమానమని అన్నారు. గత సమావేశాల్లోనూ ఇలాగే జరిగిందని.. మళ్లీ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, గురువారం దీనిపై ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖరాస్తూ.. తన నిరసన వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com