ప్రీతికి న్యాయం చేయకపోతే.. కర్నూల్‌లో హైకోర్టు పెట్టినా.. లాభం ఏంటి?: పవన్
సుగాలి ప్రీతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు పవన్ కల్యాణ్. బుధవారం కర్నూలులో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ర్యాలీ నిర్వహించిన పవన్.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి ఈ కేసును సీబీఐకి రాత పూర్వకంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మానవ హక్కుల కమిషన్ దృష్టికి తానే తీసుకెళ్తానన్నారు పవన్. చట్టాలు బలవంతుడికే బాగా పనిచేస్తాయంటూ ఫైర్ అయ్యారు పవన్.
కర్నూల్ లో జ్యూడిషియల్ క్యాపిటల్ పెడతామంటున్న జగన్ సర్కారు.. ప్రీతి విషయంలో ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రీతికి న్యాయం చేయకపోతే.. జ్యూడిషియల్ క్యాపిటల్ పెట్టి కూడా వృథా అన్నారు. దిశా గురించి మాట్లాడిన జగన్ రెడ్డి.. ప్రీతి విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. కులానికి, మతానికి కాదు ఆడ బిడ్డకు అన్యాయం జరిగిందన్నారు పవన్. ఈ కేసులో బాధితులకు న్యాయం చేయాలన్నారాయన.
అంతకు ముందు ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి మాట్లాడింది. తన కూతురుని దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. స్కూల్ కి వెళ్లిన తన బిడ్డను శవంగా ఇంటికి పంపించారన్నారు. తనకు న్యాయం చేయాలని అనేక మందిని కలిసినా.. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే తన బాధ అర్థం చేసుకున్నారన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com