అది వసతి దీవెన కాదు.. వంచెన దీవెన: చంద్రబాబు

అది వసతి దీవెన కాదు.. వంచెన దీవెన: చంద్రబాబు

ప్రజాచైతన్యయాత్రలో భాగంగా.. సొంత నియోజవకర్గం కుప్పంలో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండోరోజు పర్యటనలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌ కు పెద్దయెత్తున తరలివచ్చిన ప్రజలు.. ప్రభుత్వ పథకాలేవీ తమకు అందడం లేదంటూ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్ ను పిలవలేదన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై పోరాటం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బాబు. జగన్ మూర్ఖుడిగా, సైకోలాగా మారిపోయాడని.. తనపై కక్ష్యతో నీళ్లు రానివ్వకుండా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిండికుప్పం, కంగుంది, గోవిందపల్లి, వజలాపురం మీదుగా రెండోరోజు బాబు ప్రజా చైతన్య యాత్ర కొనసాగింది. అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుంటూ ప్రజాచైతన్య యాత్ర సాగించారు బాబు. రాములగుట్టచేనులో చంద్రబాబుకు మహిళలు కర్పూర హారుతులిచ్చారు. కంగుంది గ్రామంలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం పై బాబు నిప్పులు చెరిగారు. జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడురాజధానులేంటని.. నవ్వుకునే స్థితికి తెచ్చారని అన్నారు.

అనంతరం గోవిందపల్లి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. పేదవాడికి కడుపునిండా భోజనం పెట్టిన పార్టీ టీడీపీయేనన్నారు. కానీ, వైసీపీ పేదవాడి కడుపుకొడుతోందన్నారు. జగనన్న వసతి దీవెనపై బాబు నిప్పులు చెరిగారు. అది అది వసతి దీవెన కాదని.. వంచెన దీవెన అని అన్నారు. అమరావతిలో మహిళలపై పోలీసుల దాడులు దారుణమన్నారు చంద్రబాబు. ప్రభుత్వం అండతోనే అమరావతిలో పోలీసులు రెచ్చిపోతున్నారని అన్నారు. కుప్పంను కూడా జగన్ పులివెందులలాగా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ళ టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని సిట్ విచారణ చేయడం విడ్డూరంగా ఉందన్న బాబు.. టీడీపీ అభివృద్ధి చేస్తే.. వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని అన్నారు.

విజులాపురం బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 9 నెలల్లోనే ఎన్ని అరాచకాలో చేయాలో అన్నీచేశారన్నారు. కుప్పం ప్రజలపై జగన్ ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు బెదిరిస్తే.. కియా పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి వెళ్ళిపోతున్నారని అన్నారు బాబు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్షమందితో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.

ప్రజాచైతన్య యాత్ర తర్వాత కుప్పంలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబునాయుడు. రంగులు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశారని.. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలల్లో ఏపీ వందేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు బాబు. లక్షా 80వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ప్రజాచైతన్య యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. రాజధాని అమరావతిలోనే వుండాలని నినదించారు.

Tags

Read MoreRead Less
Next Story