రణరంగాన్ని తలపిస్తున్న విశాఖ ఎయిర్‌పోర్టు
విశాఖ ఎయిర్‌పోర్టు రణరంగాన్నితలపిస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రాంగంణంలోనే నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అటు ఆయన్ని తిరిగి మళ్లీ విమానంలో వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. దాదాపు 4 గంటల నుంచి చంద్రబాబు కాన్వాయ్‌లోనే ఉండిపోయారు. వైసీపీ శ్రేణుల ఎంతకీ ముందుకు కదలనివ్వకపోవడంతో చివరికి వాహనం దిగి అక్కడే రోడ్డుపై నిరసనకు దిగారు. అటు చంద్రబాబు కాన్వాయ్‌ను వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో.. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వమే విశాఖలో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. మంత్రులే డైరక్షన్ ఇస్తూ కార్యకర్తల్ని రెచ్చగొట్టారని ఆరోపించారు. ఎయిర్ పోర్టు వద్ద ఉన్న టీడీపీ నేతలపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ను అరెస్ట్ చేసి.. ఎయిర్‌పోర్టులోకి ఈడ్చుకెళ్లారు. అటు మీడియాపైనా దౌర్జన్యంగా వ్యవహరించారు..లోగోలను కూడా లాగిపడేశారు.
ఉదయం 9 గంటల నుంచే ఎయిర్ పోర్టు వద్ద యుద్ధవాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటను అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు వీరంగమేస్తున్నారు. ఉదయం పదకొండున్నరకే ఎయిర్‌పోర్టు చేరుకున్నారు చంద్రబాబు. అప్పటికే అక్కడికి భారీగా వచ్చిన వైసీపీ శ్రేణులు.. కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. వాతావరణం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇంతా జరుగుతుంటే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు..గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినదిస్తున్న వైసీపీ శ్రేణుల్ని లోనికి వదిలిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్ని మాత్రం అడ్డుకున్నారు.
పోలీసుల ఆంక్షలు, వైసీపీ కుట్రల్ని దాటుకుని విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు అధినేతకు ఘన స్వాగతం పలికారు. జై చంద్రబాబు.. జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. పోటీగా YCP కార్యకర్తలు గోబ్యాక్ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ పోటాపోటీ నినాదాలతో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపించింది. పరస్పరం దాడులకు దిగడంతో కొందరికి గాయాలయ్యాయి. చంద్రబాబే టార్గెట్‌గా కోడిగుడ్లు, టమాటాలు విసిరారు వైసీపీ కార్యకర్తలు..అవి పక్కనే ఉన్నకానిస్టేబుల్‌పై పడ్డాయి. చెప్పులు కూడా తీసి విసరబోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com