కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. రోజుకో దేశానికి విస్తరిస్తూ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య లక్షకు పైగా చేరింది. మృతుల సంఖ్య 3 వేల 400 దాటింది. ఒక్క చైనాలోనే 3 వేల 70 మంది మృత్యువాత పడ్డారు. చైనాలోని వుహాన్ సీఫుడ్ మార్కెట్లో వెలుగుచూసిన వైరస్ సరిహద్దు దాటి ఖండాంతరాలకు వ్యాపించింది. దాదాపు 90 దేశాలపై దాని ప్రభావం చూపిస్తోంది. వైరస్‌ దెబ్బతో అన్ని రంగాలు కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది.

అయితే చైనాలో కాస్తా తగ్గు ముఖం పట్టిన కరోనా.. ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక భారత్‌లో కూడా రోజు రోజుకు కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 31కి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాయి. అధికారులు మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం విదేశాల నుంచి వచ్చిన 27 వేల 481 మంది ప్రయాణికులకు కరోనా అనుమానిత లక్షణాలుండటంతో వైద్యులు వారిని తమ పర్యవేక్షణలో ఇళ్లలోనే ఐసోలేషన్‌ చేశారు. ఈ నెల 2 నాటికి వారిలో 19 వేల 945 మంది 28 రోజుల కాల పరీక్షలో.. ఎలాంటి లక్షణాలు లేకుండా బయటపడినట్లు నిర్ధారించారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జనం రద్దీ ప్రాంతాల్లో తిరగాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటి వరకు దుబాయ్‌ నుంచి వచ్చిన ఒక్క వ్యక్తికి మాత్రమే కరోనా నిర్థారణ అయ్యింది. కరోనా గాంధీ ఆస్పత్రికి కరోనా అనుమానితుల రాక తగ్గుముఖం పట్టడంతో వైద్య ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంది. పరీక్షల కోసం శుక్రవారం పదిమంది మాత్రమే గాంధీ వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు. అతడితో ప్రత్యక్ష సంబంధాలున్న దాదాపు 88 మందిలో కరోనా బయట పడకపోవడంతో.. కొత్త కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉండదని భావిస్తున్నారు.

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో రెండు కరోనా అనుమానిత కేసులను వైద్యులు గుర్తించారు. కువైట్‌, నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. రుయా ఐసోలేషన్‌ వార్డులో ఇద్దరికీ వైద్యం అందిస్తున్నారు. వారం క్రితం కరోనా అనుమానంతో తైవాన్‌ వాసి రుయాలో చేరాడు. రిపోర్ట్‌ నెగెటివ్‌ రావడంతో అతడ్ని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. ఏపీలో ఇప్పటివరకూ వేర్వేరు దేశాల నుంచీ రాష్ట్రానికి వచ్చిన 378 మందిపై అధికారులు నిఘా పెట్టారు. 153 మందిని ఇళ్లలోంచి బయటకు రావొద్దని ఆదేశించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్‌ల వాడకం విపరీతంగా పెరిగిది. దీంతో మాస్క్‌ల కొరత ఏర్పడింది. ఇంతకు ముందు మాస్క్‌ ధర 20 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు మాస్క్‌ల కొరత సృష్టిస్తే.. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌తో ఎలాంటి భయం లేదని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఈటల సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story