వైసీపీకి షాక్‌లు.. రోడ్డెక్కుతున్న అసమ్మతి వర్గాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి షాక్‌లు తగులుతున్నాయి. నేర చరితులకు సీట్లు ఇవ్వబోమని పార్టీ నాయకత్వం ప్రకటిచంగా.. అందుకు భిన్నంగా జరుగుతోందని గుంటూరు, విశాఖపట్నంలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. గుంటూరులో హోంమంత్రి సుచరిత ఇంటిని కార్యకర్తలు ముట్టడించారు. విశాఖలో దాడి వీరభద్రరావును నిలదీశారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన లేదంటూ విమర్శలు గుప్పించారు.
గుంటూరు వైసీపీలో వర్గ విభేదాలు రోడ్డున పడ్డాయి. హోంమంత్రి సుచరిత ఇంటిని వైసీపీ శ్రేణులు ముట్టడించాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలకు పొంతనలేదని వాళ్లు ఆరోపించారు. గుంటూరు కార్పొరేషన్‌లో 27వ వార్డును... రౌడీషీటర్, భూకబ్జాకోరుకు ఎలా ఇస్తారంటూ హోంమంత్రిని నిలదీశారు. ఆమె ఇంటి ముందు నినాదాలు చేశారు. ఇప్పటికైనా.. వైసీపీ నాయకత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం వైసీపీలోను అసంతృప్తి భగ్గుమంది. GVMC ఎన్నికల్లో 37వ వార్డులో సీటు కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ కేడర్,పార్టీ కార్యాలయాన్ని ముట్టడించింది. ఆఫీసులో ఆందోళన నిర్వహించారు. ఆ సమయంలో అక్కడున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావును మహిళలు నిలదీశారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని.. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి గంపగుత్తగా ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. 37వ వార్డులో ఎన్నో ఏళ్లుగా తాను కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. కొత్తగా వచ్చిన డమ్మీ క్యాండేట్ వడ్డాది రాజుకు అవకాశం ఇచ్చారని జానకిరామ్ ఆరోపించారు.
ఇప్పటికే ఎన్నికల వాయిదాపై వైసీపీ హైకమాండ్ అగ్గిమీదగుగ్గిలం అవుతోంది. ముఖ్యమంత్రితోపాటు మంత్రులంతా సహనం కోల్పోయి అపశృతిలో మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో రెబల్స్ గొడవ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఏకంగా సీఎంను నిలదీస్తూ.. మంత్రుల ఇళ్లను ముట్టడించడం కలకలం రేపుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com