లోకల్ వార్‌పై మాటల వార్
స్థానిక ఎన్నికల వాయిదాను ప్రభుత్వం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. SEC రమేష్ కుమార్ టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే గవర్నర్ దగ్గర పంచాయితీ పెట్టారు సీఎం జగన్. అటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. సీఎస్ ద్వారా లేఖాస్త్రం సంధించారు. అయినా ఎస్‌ఈసీ వెనక్కి తగ్గకపోవడంతో మంత్రులు తమ అక్కసంతా వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల్ని వాయిదా వేసే హక్కు రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ వివరణ ఇస్తూ రాసిన లేఖపైనా విమర్శలు గుప్పించారు. అసలు ఆ లేఖ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లుగా లేదని.. తెలుగుదేశం నేత రాసినట్లు ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపిచారు.
ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. కరోనాపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలతో రాష్ట్రం పరువు పోతోందన్నారు. ఈసీపై ఇంత దారుణంగా చౌకబారు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. వైసీపీలో ఏ కులానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను కేంద్ర బలగాల బందోబస్తుతో మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషనర్ ఆదేశించినా.. గుంటూరు, తిరుపతి ఎస్పీలపై ఇంకా ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు టీడీపీ నేతలు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, వ్యవస్థలపై నమ్మకంలేదన్నారు. అటు, సీఎం జగన్ ఒక శంకర్ దాదా అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కరోనా వైరస్‌తో ప్రజలంతా భయపడుతుంటే.. జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసుల సహకారంతో ప్రతిపక్షం లేకుండా చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ తీరుపై బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు మండిపడ్డారు.
ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్నికల నిర్వహణ విషయంలోవైసీపీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అటు SECకి నేరుగా లేఖరాయడం ద్వారా ఆయనపైనా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు SEC వివరణ ఇస్తూ రాసిన లేఖను కూడా తప్పుపడుతున్నారు. అటు ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. వాయిదాను సవాల్ చేసూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com