రంగులకు ఖర్చు చేసిన డబ్బును వైసీపీ నుంచి రాబట్టాలి: చంద్రబాబు

రంగులకు ఖర్చు చేసిన డబ్బును వైసీపీ నుంచి రాబట్టాలి: చంద్రబాబు
X

రంగులకు చేసిన ఖర్చును వైసీపీ నుంచే రాబట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు కలిగిస్తుందో రంగుల ఉదంతమే రుజువన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు, కోర్టు ధిక్కారానికి, అహంభావానికి-మూర్ఖత్వానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు వేయడం వైసీపీ మూర్ఖత్వానికి పరాకాష్ట అని తెలిపారు. తాము చేసిందే రైట్‌ అంటూ కోర్టుల్లో పెడ వాదనలు చేయడం, తప్పుడు జీవోలు ఇవ్వడం, వందల కోట్ల ప్రజాధనం వృథా చేయడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదన్నారు చంద్రబాబు.

ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం నూరు తప్పులు చేసిందన్నారు చంద్రబాబు. రంగులపై ఎంత డబ్బు వృథా చేశారని మండిపడ్డారు. తీర్పు అమలు చేయలేదు కాబట్టి కోర్టు ధిక్కరణగా తీసుకొని సీఎస్‌, సెక్రెటరీ, కమిషనర్‌ హాజరుకావాలని ఆదేశించిందన్నారు. వైసీపీ తప్పులకు ఉన్నతాధికారులు ముగ్గురూ కోర్టులో నిలబడ్డారన్నారు. మళ్లీ మూర్ఖంగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారని ధ్వజమెత్తారు. కొట్టేస్తారని తెలిసి ఇన్ని జీవోలు ఇవ్వడం ఉన్మాదం కాకపోతే ఏమిటని ప్రశ్నించారు.

అందరిదీ ఒకదారి అయితే వైసీపీది మరో దారని.. అదే అడ్డదారి-మాయదారంటూ చంద్రబాబు విమర్శించారు. రంగులపై డబ్బులు వృథా, అడ్వకేట్లకు ఫీజులు వృథా అని నిప్పులు చెరిగారు. ఇప్పుడు తొలగించడానికీ డబ్బులు వృథా అంటూ మండిపడ్డారు. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు చంద్రబాబు.

Tags

Next Story