కాళ్ల పారాణీ ఆరకముందే కానరాని లోకాలకు.. వధూవరులిద్దరూ..

విధికి కన్నుకుట్టిందో ఏమో వివాహాం చేసుకున్న ఆ జంటను యాక్సిడెంట్ రూపంలో ఎత్తుకుపోయింది. తెనాలికి చెందిన ఆలపాటి మానస నవ్యను సాప్ట్ వేర్ ఇంజినీర్ యడ్లపల్లి వెంకటేష్ ఈనెల 14న వివాహం చేసుకున్నారు. మూడు రోజుల అనంతరం ఆనందంగా అత్తవారింటికి పయనమయ్యారు నూతన దంపతులు ఇరువురూ కారులో. వరుడి స్వస్థలం విశాఖ పట్నం జిల్లా సబ్బవరానికి గురువారం మధ్యాహ్నం కారులో వెళుతున్నారు. భీమడోలు సమీపంలోని పూళ్ల గ్రామం వద్దకు చేరుకోగానే కారు డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
కారులో ఉన్న నవ దంపతుల కళ్లు మూశారు. ఇరువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇరుకుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. నాలుగు రోజుల క్రితమే పచ్చని పెళ్లి పందిట్లో అక్షితలు వేసి ఆశీర్వదించామే.. అంతలోనే ఇలా అయిందేమిటని కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. డ్రైవర్ కునుకు తీయడంతో కారు అదుపు తప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com