బీజేపీకి వారణాసి ఎంతో, కేరళ కూడా అంతేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా తాము మాత్రం మలయాళీల అభి వృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలన్న మోదీ, దేశ ప్రజలందరి బాగోగులు చూడటం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలే దేవుళ్లు అన్న ప్రధాని, ఎలాంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల అభివృద్దికి తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తలు జనసేవకులు అని, వారు తమ జీవితమంతా ప్రజల సేవకే కట్టుబడి ఉన్నారని అభివర్ణించారు.
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న తర్వాత ప్రధాని మోదీ తొలిసారి కేరళకు వచ్చారు. త్రిస్సూర్ జిల్లాలోని ప్రఖ్యాత గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. కోచీ నుంచి నేవీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గురువాయూర్ ఆలయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ పి.సదాశివం, కేంద్రమంత్రి V.మురళీధరన్, కేరళ మంత్రి సురేంద్రన్‌లు సాదర స్వాగతం పలికారు. అనంతరం మోదీ కేరళ సంప్ర దాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గురువాయూర్ ఆలయ సందర్భంగా ప్రధాని మోదీ తులాభారం నిర్వహించారు . మోదీ తన బరువుకు సమానంగా 100 కిలోల కమల పువ్వులతో తులాభారం వేసి ఆలయా నికి సమర్పించారు. అదేవిధంగా నెయ్యి, ఎర్రటి అరటిపండ్లను స్వామివారికి సమర్పించారు.