Budget 2026 : కేవలం టాక్స్ మాత్రమే కాదు..ప్రభుత్వ ఖజానా నింపే మాయా మార్గాలు ఇవే.

Update: 2026-01-12 09:30 GMT

Budget 2026 : ప్రతి ఏటా ఫిబ్రవరి 1 రాగానే అందరి కళ్లూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపే ఉంటాయి. ఏది చౌక అవుతుంది? ఏది ప్రియమవుతుంది? మనకు ఏమైనా టాక్స్ రిలీఫ్ వస్తుందా? అని మాత్రమే సామాన్యులు ఆలోచిస్తుంటారు. కానీ, ఒక దేశాన్ని నడపడానికి అవసరమైన లక్షల కోట్ల రూపాయలు అసలు ప్రభుత్వం దగ్గరకు ఎలా చేరుతాయి? మన ఇంటి బడ్జెట్ లాగే, దేశ బడ్జెట్‌లో కూడా రాబడి మార్గాలు అనేకం ఉంటాయి. ప్రభుత్వం కేవలం మన దగ్గర వసూలు చేసే పన్నుల మీద మాత్రమే ఆధారపడదు. ఆ రహస్య మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సింహభాగం పన్నుల నుంచే వస్తుంది. దీనిని రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి డైరెక్ట్ టాక్స్(ప్రత్యక్ష పన్ను), అంటే మనం కట్టే ఆదాయపు పన్ను, కంపెనీలు కట్టే కార్పొరేట్ టాక్స్. రెండోది ఇన్‌డైరెక్ట్ టాక్స్(పరోక్ష పన్ను). మనం కొనే చిన్న సూది దగ్గర నుండి పెద్ద కారు వరకు ప్రతి వస్తువు మీద ప్రభుత్వం జీఎస్టీ రూపంలో ఆదాయం పొందుతుంది. పెట్రోల్, డీజిల్, మద్యం మీద వేసే ఎక్సైజ్ డ్యూటీ కూడా ప్రభుత్వ ఖజానాను నింపే పెద్ద వనరు. ఈ డబ్బుతోనే ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.

ప్రభుత్వం ఒక పెద్ద వ్యాపారవేత్త కూడా. దీనిని నాన్-టాక్స్ రెవెన్యూ అంటారు. అంటే ప్రభుత్వం అందించే వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయం. మీరు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినప్పుడు కట్టే చలాన్లు, పాస్‌పోర్ట్ ఫీజులు, వివిధ ప్రభుత్వ సేవల రుసుములు అన్నీ ఖజానాకే వెళ్తాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి సొంతంగా రైల్వేలు, ప్రభుత్వ బ్యాంకులు, పోస్టల్ శాఖ వంటి సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఓఎన్‌జీసీ లాంటి పెద్ద కంపెనీలకు వచ్చే లాభాల్లో వాటా కూడా ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రకృతి వనరులైన బొగ్గు గనులు, ఖనిజాలు, మొబైల్ నెట్‌వర్క్ కోసం వేసే స్పెక్ట్రమ్ వేలం ద్వారా కూడా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.

ఒక్కోసారి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. కొత్త రోడ్లు వేయాలన్నా, ఆసుపత్రులు కట్టాలన్నా నిధులు సరిపోనప్పుడు ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. దీని కోసం ప్రభుత్వం మార్కెట్‌లో బాండ్లను విడుదల చేస్తుంది. వీటిని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఒక్కోసారి సామాన్యులు కూడా కొంటారు. అలాగే మనం పోస్టాఫీస్ పొదుపు పథకాలు లేదా పీపీఎఫ్లో దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న కంపెనీల వాటాలను అమ్మి కూడా భారీగా నిధులను సేకరిస్తుంది. ఇలా ముక్కూ ముఖం తెలియని అనేక మార్గాల ద్వారా దేశం నడుస్తుంది.

Tags:    

Similar News