ఆసీస్‌ అదరహో..

Update: 2019-06-21 01:08 GMT

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సంచలన విజయాలతో దూసుకెళ్తున్న బంగ్లా జోరుకు బ్రేక్ పడింది. వార్నర్‌ 166 రన్స్‌తో చెలరేగిన వేళ..48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఓడిపోయింది. 382 భారీ లక్ష్య చేధనలోనూ ఆసీస్‌కు గట్టిపోటీ ఇచ్చింది బంగ్లాదేశ్‌. ఒకానొక దశలో లక్ష్యాన్ని ఛేదిస్తుందా అనిపించింది. అయితే కీలక సమయంలో వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ బంగ్లా ఆశలపై నీళ్లు చల్లింది

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 5 వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు వార్నర్‌, పించ్‌ తొలి వికెట్‌కు 121 పరుగులు చేసి శుభారంభం ఇచ్చారు. దీంతో ఆసీస్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ కుర్రాళ్లు కూడా గట్టిపోటీనే ఇచ్చారు. ఆసీస్‌ను కంగారు పెట్టారు. 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీం 102 పరుగులతో అజేయ సెంచరీ సాధించగా, మహ్మదుల్లా 69, తమీమ్‌ ఇక్బాల్‌ 62 రన్స్‌తో రాణించారు.

చివరి దశలో ముష్ఫికర్‌, మహ్మదుల్లా ధాటిగా ఆడి ప్రత్యర్థికి దడ పుట్టించారు. ముఖ్యంగా సిక్స్‌లతో చెలరేగిన మహ్మదుల్లా.. బంగ్లా శిబిరంలో కాస్త ఆశలు రేపాడు. 28 బంతుల్లో 80 పరుగులు చేయాల్సిన సమయంలో నైల్‌ మ్యాజిక్ చేశాడు. అద్భుతమైన బౌలింగ్‌తో మహ్మదుల్లా, షబ్బీర్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి బంగ్లా ఆశలు వమ్ము చేశాడు. వరల్డ్‌కప్‌లో వార్నర్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో చెలరేగాడు.

Similar News