ఏపీలో పూర్తిగా టీడీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు..

Update: 2019-06-21 02:48 GMT

ఘన చరిత్ర ఉన్న టీడీపీ ఎన్నడూ లేనంత సంక్షోభంలో పడింది. ఏపీలో బలపడేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఊహించని దెబ్బ తగిలింది. ఇంతకాలం చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయులుగా ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు షాక్‌ ఇచ్చారు. ఆయన విదేశాల్లో ఉన్న సమయం చూసి మరి సైకిల్‌ సవారీ నుంచి తప్పుకున్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో.. ఆర్థిక, రాజకీయ పనుల్లో చంద్రబాబునాయుడుకు కుడి ఎడమ భుజాలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు అర్ధాంతరంగా బీజేపీ పడవ ఎక్కేశారు. వారితో పాటు సీనియర్ నాయకుడు టీజీ వెంకటేష్‌, చంద్రబాబు మరో విధేయుడు గరికపాటి మోహన్‌రావులు కూడా కాషాయ గూటికి చేరారు. కేవలం బీజేపీలో చేరడమే కాదు.. పోతూ పోతూ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని కూడా బిజెపిలో విలీనం చేస్తున్నామంటూ రాజ్యసభ చైర్మన్‌కు లేఖలు కూడా ఇచ్చారు.

ఇప్పటికే ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో ఆత్మస్థైర్యం కోల్పోయిన టీడీపీకి.. పార్టీ ఫిరాయింపులు దెబ్బ కొట్టినట్టైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు దేశంలో లేని సమయంలో పరిస్థితి తలకిందులు కావడం టీడీపీ కేడర్‌ను గందరగోళంలోకి నెట్టేసింది.

2014 నుంచి 19 వరకు కు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యుల సంఖ్య ఉంది. ఆరుగురిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఇటీవలి ఎన్నికల ఫలితాలు వారిని బాబుకు దూరాం చేశాయి. పార్టీలో విడివిడిగా సభ్యులను చేర్చుకుంటే వారు అనర్హతకు లోనయ్యే అవకాశం ఉందని గ్రహించి.. టీడీపీ ఎంపీలను పార్టీలో విలీనం చేసుకుంది బీజేపీ. ఒకే రోజులో ప్రక్రియను అంతా పూర్తి చేసేసింది.

రాజ్యసభలో రెండు వంతులు ఉన్న తమని బిజెపిలో చేర్చుకోవాల్సిందిగా కోరుతూ నలుగురు ఎంపీలు.. బీజేపీ పార్టీ జాతియఅధ్యక్షుడు అమిత్‌షాను కలిసి కోరారు. తమ పార్టీని విలీనం చేసుకునేందుకు అవసరమైన సభ్యుల సంఖ్యలో ఉన్నందున ఆ మేరకు తీర్మానం చేసి అమిత్ షాకు ఒక కాపీ.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మరో కాపీ అందజేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం తమ విలీనాన్ని గుర్తించాల్సిందిగా వెంకయ్యనాయుడును వారు కోరారు. మరోవైపు అమిత్‌ షా కూడా తెలుగుదేశం సభ్యుల చేరికకు ఆమోదం తెలుపుతున్నట్టుగా మరో లేఖను ఆ పార్టీ రాజ్య సభ నాయకుడు తవర్చంద్ గెహ్లోట్ , మంత్రి కిషన్ రెడ్డి ద్వారా వెంకయ్య నాయుడుకు పంపారు. దీంతో ఆమోదం తెలపడం మాత్రమే రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య నాయుడుకు మిగిలిన ఏకైక మార్గమయ్యింది. రాజ్యసభ చైర్మన్‌కు లేఖ ఇచ్చిన కాసేపటికే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర యాదవుల సమక్షంలో సుజనా, సీఎం రమేష్‌, టీజీలు బీజేపీ కండువాలు కప్పుకున్నారు.

ప్రజలంతా నరేంద్ర మోదీ వైపు ఉన్నారు కాబట్టే తాము కూడా ప్రజలు చెప్పిన మాటే వింటున్నామన్నారు పార్టీ ఫిరాయించన ఎంపీలు. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో ఇప్పటివరకు కేవలం నలుగురుగా ఉన్న తమ సంఖ్యాబలం బీజేపీలో చేరడం ద్వారా నాలుగు వందలకు చేరిందని.. దీంతో విభజన హామీలు నెరవేర్చుకోవడానికి మరింత శక్తిని సమకూర్చుకున్నామన్నారు.

ఎంపీల చేరికపై వస్తున్న అనేక విశ్లేషణలపై సుజనా చౌదరి స్పందించారు. ఎన్డీఏ నుంచి బయటకు రావాలి అన్న ఆలోచనతో తాను ఎప్పుడో విభేదించాననీ, అయినా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకు కట్టుబడి పార్టీ కోసం పని చేశానని సుజనా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇకపై ముగిసిన అధ్యాయమన్నారు. తనపై ఉన్నవన్నీ కేవలం అభియోగాలే అని.. ఆ ఆరోపణలను ఎదుర్కొనేందుకు విచారణకు సిద్ధమన్నారు.

ప్రస్తుతానికి బీజేపీ ఆకర్ష్‌ కేవలం రాజ్యసభకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏపీలో పూర్తిగా టీడీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఒకటి రెండు నెలల్లో మరిన్ని చేరకలు ఉంటాయంటున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు సైతం కొందరు ఇప్పటికే బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వలసలకు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.

Similar News