ప్రగతి భవన్‌లో జగన్, కేసీఆర్ సమావేశం

Update: 2019-06-28 07:52 GMT

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. జగన్ బృందాన్ని సాదరంగా స్వాగతించిన కేసీఆర్..కాసేపు తన ఛాంబర్ లో ఏకాంతంగా సమావేశం అయ్యారు. పదకొండున్నరకు ఇద్దరు సీఎంలు సమావేశం మందిరానికి చేరుకొని రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చలు ప్రారంభించారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్ర నాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య, సజ్జల రామకృష్ణారెడ్డి హజరవగా..తెలంగాణ నుంచి మంత్రులు మంత్రులు ఈటెల రాజెందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు సీనియర్ ఎంపీ కె.కేశవరావు హజరయ్యారు. వీరితో పాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషి సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ధిక, ఇరిగేషన్ శాఖతో పాటు.. విద్యుత్, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, పలు శాఖల ఉన్నతాధికారులు భేటీకి హజరయ్యారు.

విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న ఆస్తులు, ఉద్యోగుల పంపకాలతో పాటు బకాయిల చెల్లింపుల అంశాలపై చర్చిస్తారు. రేపు కూడా ఈ చర్చలు కొనసాగుతాయి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో చర్చలు ఉంటాయని ఇప్పటికే రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ లోకి తరలింపుపై రెండు రాష్ట్రాల ఇంజనీర్ల బృందం సూచనలతో జగన్, కేసీఆర్ చర్చిస్తారు.

Similar News