YCP Manifesto: మ్యానిఫెస్టో చూసి హతాశులైన గ్రామ, వార్డు వాలంటీర్లు

వేతనాల పెంపు ఊసే లేదు, ఉద్యోగ అవకాశాల కల్పనకైనా భరోసా లేదంటూ ఆవేదన

Update: 2024-04-28 05:45 GMT

నెలకు రూ.5 వేలిస్తూ నాలుగున్నరేళ్లు గొడ్డు చాకిరీ చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్‌.. తాజా మ్యానిఫెస్టోలో తమకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుతామని ప్రస్తావించకపోవడంతో వాలంటీర్లు హతాశులయ్యారు. వాలంటీర్లలో డిగ్రీ, బీటెక్‌, పీజీలు చేసినవారు చాలా మందే ఉన్నారు. మ్యానిఫెస్టోలో తమ వేతన పెంపు గురించి మాట్లాడకపోగా.. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనపై కూడా ఎలాంటి భరోసా లేకపోవడం వారిని మరింత కుంగదీసింది. నెలకు రూ.5 వేలు వేతనమంటే సగటున రోజుకు రూ.165. ఈ మొత్తంతో కుటుంబ పోషణ సాధ్యమవుతుందా? అయినా నాలుగున్నరేళ్లు ఇదే వేతనం చెల్లిస్తూ కాలం గడిపారు. ఉద్యోగులు, ఇతర వర్గాలకు ఐదేళ్ల కాలంలో ఎంతో కొంతయినా జీతం పెరుగుతుంది. తమకు వేతనాలు సరిపోవడం లేదని, ఎంతో కొంత పెంచాలని వాలంటీర్లు ధర్నాలు, నిరసనలు చేసినా జగన్‌ పట్టించుకోలేదు. పైగా స్వచ్ఛంద సేవకులంటూ వారికి కితాబిచ్చారు. ఇప్పుడు మరో ఐదేళ్ల కాలానికి ప్రకటించిన మ్యానిఫెస్టోలోనూ వారి వేతనాల పెంపు గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంటే ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా వేతనాలు పెంచేందుకు ఆయనకు మనసొప్పలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా వాలంటీర్లు మండిపడుతున్నారు. 

వాలంటీర్లను రాజీనామా చేయించి, పార్టీ ప్రచారానికి తిప్పుకోవాలని వైకాపా నేతలు దాదాపుగా నెల రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. బెదిరింపుల దగ్గర నుంచి ప్రలోభాల వరకు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నా మెజారిటీ వాలంటీర్లు తలొగ్గడం లేదు. ఇన్నాళ్లూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా వేతనాలిచ్చి.. అదేదో పార్టీ నుంచి ఇచ్చినట్టు ఇప్పుడు పనిచేయాలని చెప్పడంపై చాలా మంది గుర్రుగా ఉన్నారు. చాలామంది ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలోనూ ఎక్కువ మంది వైకాపా అనుకూల ప్రచారానికి మొగ్గు చూపడం లేదు. కృష్ణా, నెల్లూరు, తదితర జిల్లాల్లో కొందరు రాజీనామా చేసి ఏకంగా తెదేపాలో చేరిపోవడంతో వైకాపా నేతలు కంగు తిన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 60 వేల మంది రాజీనామా చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వైకాపాపై అనుకూలతతో రాజీనామా చేసినవారు 5 శాతం మించి ఉండరు. 

Tags:    

Similar News