ఊహించని ట్విస్ట్.. సీఎం కుమారస్వామి సంచలన ప్రకటన

Update: 2019-07-12 09:43 GMT

కర్నాటక సీఎం కుమారస్వామి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.. తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం మరో కీలక మలుపు తిరిగింది. బలపరీక్షకు సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను సీఎం కుమారస్వామి కోరారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అన్నారు కుమార స్వామి. ఇలాంటి సమయంలో తాను అధికారంలో ఉండలేను అన్నారు. అయితే తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దాన్ని రుజువు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాజా పరిణామాల నేపథ్యంలో బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

సీఎం కుమారస్వామే స్వయంగా బలపరీక్షకు టైం ఫిక్స్‌ చేయమని అడగడంతో.. స్పీకర్‌ ఎప్పుడు సమయమిస్తారన్నది ఉత్కంఠగా మారింది. రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది క్షణాలకే కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు కర్ణాటక రెబల్‌ ఎమ్మెల్యేలు, స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ పిటిషన్లపై సుప్రీం కోర్టు రెండో రోజూ సుదీర్ఘంగా విచారించింది. స్పీకర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం.. ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామా, అనర్హత వేటుపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది.. దీనిపై తుది తీర్పును మంగళవారం ప్రకటిస్తామని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.

Similar News