అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు.. నర బలులు కలకలం రేపుతున్నాయి. ముగ్గురు వ్యక్తులను దారుణంగా గొంతుకోసి చంపడంతో స్థానికులు హడలిపోతున్నారు. చంద్రగ్రహానానికి ముందే ఈ హత్యలు జరగడంపై అనుమానాలు ఇంకాస్త పెరుగుతున్నాయి.. పాత కక్షల కారణంగా హత్యలు చేసి ఉంటే.. శివ లింగం దగ్గర ఉన్న పాముల పుట్టపై రక్త తర్పణం ఎందుకు చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమావస్య ముందు జరిగిన ఈ హత్యలు కచ్చితంగా నరబలులే అని గ్రామస్థులు భయపడుతున్నారు.
తనకల్లు మండలంలోని కొర్తికోట గ్రామం గజగజా వణుకుతోంది. క్షుద్రపూజలు, నర బలులు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని శివాలయం దగ్గర ఉంటున్న శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మీని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి చంపారు. పక్కనే ఉన్న శివాలయంలో రక్తంతో అభిషేకం చేశారు. పాములపుట్టపై రక్తతర్పణం చేశారు. ఆలయం మొత్తం రక్తం మరకలతో నిండిపోయింది. చంద్రగ్రహనానికి ముందు రోజు.. అదీ అర్థారాత్రి మూడు హత్యలు చేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి హత్యకు పాత కక్షలు.. లేదా ఇతర కారణాలు ఏమీ కనిపించడం లేదని.. ఒకవేళ అలాంటి కారణాలతో హత్యలు చేస్తే.. శివుడికి ఎందుకు అభిషేకం చేశారని.. పాముల పుట్టపై రక్త తర్పణం ఎందుకు చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు మూడు దారుణ హత్లు జరగడంతో స్థానికు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
స్థానికుల ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు పోలీసులు. మృతులకు ఎవ్వరితోను విభేదాలు లేవని గ్రామస్థులు చెప్పడంతో నరబలి జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా లభించిన ఆధారాలు.. గ్రామాస్థులు ఇచ్చిన సమాచారంతో గుప్త నిధుల కోసం నరబలుల చేసి ఉంటారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.
మొన్న కర్నూల్లోనూ ఇలాంటి ఘటన జరిగింది. తలముడిపిలో బ్రహ్మంగారి మఠం దగ్గర క్షుద్రపూజలు కలకలం రేపాయి. స్కూలు గదిపై జరిపిన తాంత్రిక పూజలు పిల్లలను, వారి తల్లిదండ్రులను వణికించాయి. తిమ్మాపురంలో దూదేకుల హుసేన్ ఇంటి ముందు కొందరు క్షుద్రపూజలు చేశారు. బొమ్మకు సూదులు గుచ్చి పూజలు చేసి హడలగొట్టేశారు. మరోవైపు నల్లమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చిన నరబలి సంచలనం రేపింది. శిరివెళ్ల మండలం పచ్చర్ల సర్వ నరసింహ స్వామి ఆలయం వద్ద దుండగులు ఓ యువకున్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేసి కాలువలో పూడ్చి పెట్టారు. అసలు గ్రహణం వస్తోందంటే చాలు.. క్షుద్రపూజల ఆనవాళ్లు భయపెడుతున్నాయి. గుప్తనిధుల కోసం గాలించే వాళ్లు, తమకు అడ్డంగా ఉన్న వారిని తొలగించాలనుకునే వాళ్లు.. అమావాస్య, పున్నములకు ఏవేవో తాంత్రిక పూజలు చేసేస్తున్నారు. జంతు బలులేతోనే ఆగడం లేదు.. ఏకంగా మనుషుల్నే బలిచ్చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం అనంతపురంలో జరిగిన దారుణ హత్యలు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నాయి.