కుండపోత వర్షాలు, వరదలు.. స్తంభించిన రవాణా వ్యవస్థ

Update: 2019-07-17 02:05 GMT

కుండపోత వర్షాలు, వరదలకు ఉత్తరాదితోపాటు ఈశాన్య భారతం వణికిపోతోంది.. వరదలు పోటెత్తడంతో నదులు, వాగులు కట్టలు తెంచుకుంటున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.. మరోవైపు నేపాల్‌, బంగ్లాదేశ్‌లోనూ వరద బీభత్సం కొనసాగుతోంది.. నేపాల్‌లో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.. అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, మిజోరం, బిహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ర్టలో కుంభవృష్ణి కురుస్తోంది. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.. నాలుగైదు రోజులుగా నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి.. అసోంలో వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.. ఇప్పటి వరకు 43 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

ఇక మిజోరంలో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి.. మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ర్టాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు త్రిపుర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.. ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉత్తర బెంగాల్ అస్తవ్యస్తమైంది. వర్షాలకు కొండ చరియలు విరిగి పడడం, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునగడం, అనేక రోడ్లు కనిపించకుండా చెరువుల్లా మారిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. ఇడుక్కి, వయనాడ్‌, కానూర్‌, ఎర్నాకులం, త్రిసూర్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అప్రమత్తమయిన అధికారులు ముందుస్తు జాగ్రత్తగా హైఅలర్ట్‌ ప్రకటించారు.

Similar News