రాజ్యసభలో బుధవారం ఉద్విగ్న వాతావరణం నెలకొంది. D.రాజా, K.R.అర్జునన్, డాక్టర్. R. లక్ష్మణన్, రత్నవేల్, డాక్టర్ మైత్రేయన్‌ల పదవీ కాలం ముగిసింది. ఈ ఐదుగురు సీనియర్ ఎంపీలు ఒకేసారి రిటైర్ కావడం పెద్దలసభను ఉద్వేగానికి గురి చేసింది. వీరితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇతర సభ్యులు భావోద్వేగానికి లోన య్యారు. ఐదుగురు సభ్యుల సేవలను పెద్దలసభ కోల్పోతోందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
పదవీకాలం పూర్తైన ఎంపీలు కూడా ఫేర్‌వెల్ ప్రసంగంలో కన్నీటి పర్యంతమయ్యారు. వీడ్కోలు ప్రసంగం చేసిన డాక్టర్ మైత్రేయన్, ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభకు పని చేసే అవకాశమి చ్చిన జయలలితకు కృతజ్ఞతలు తెలిపిన మైత్రేయన్, ఓ సందర్భంలో కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఐదుగురు ఎంపీల సేవలను ఇతర పార్టీల ఎంపీలు కొనియాడారు. రాజాను చాలా మిస్సవుతున్నామని, ఆయన రోజుకు నాలుగుసార్లైనా మాట్లాడుతారని కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ అన్నారు. అన్నాడీ ఎంకే నేత మైత్రేయన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో అర్థం కావడం లేదన్న ఆజాద్, మైత్రేయన్ ఓ డాక్టర్ అని గుర్తు చేశారు. సంపాదన వదిలేసి రాజకీయాల్లోకి రావడం గొప్ప విషయమన్నారు. మొత్తానికి ఐదుగురు ఎంపీల ఫేర్‌వెల్ ప్రసంగాలు, వారి భావోద్వేగాలతో.. పెద్దల సభ ఉద్విగ్న వాతావరణానికి లొనైంది.