Budget 2026 : ఆదివారం బడ్జెట్..మరి షేర్ మార్కెట్ పరిస్థితి ఏంటి? క్లారిటీ వచ్చేసింది.

Update: 2026-01-13 09:45 GMT

Budget 2026 : భారత ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి వంటి కేంద్ర బడ్జెట్ 2026-27 సమర్పణకు ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని ఈసారి కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడం విశేషం. సాధారణంగా ఆదివారం పార్లమెంటుకు, షేర్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. కానీ బడ్జెట్ వంటి అత్యంత కీలకమైన అంశం కావడంతో, ప్రభుత్వం ఆదివారం రోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే ఆమోదం తెలిపారు.

ఆదివారం మార్కెట్ తెరుస్తారా?

బడ్జెట్ రోజున మార్కెట్ కదలికలు చాలా కీలకంగా ఉంటాయి. ఆర్థిక మంత్రి ప్రకటించే ప్రతి అంశం సెన్సెక్స్, నిఫ్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, సెలవు రోజైనప్పటికీ ఫిబ్రవరి 1న ట్రేడింగ్‌కు అనుమతించే అవకాశం ఉందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గతంలోనే సంకేతాలిచ్చింది. సాధారణంగా బడ్జెట్ శని లేదా ఆదివారాల్లో వచ్చినప్పుడు, ఇన్వెస్టర్లు రియాక్ట్ అవ్వడానికి వీలుగా ఎక్స్ఛేంజీలు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లు నిర్వహిస్తుంటాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సర్క్యులర్ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుండి పూర్తి వివరాలు అందిన వెంటనే NSE, BSE తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాయి.

26 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అరుదైన విషయం. సుమారు 26 సంవత్సరాల క్రితం, అంటే 2000వ సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత నిర్మలా సీతారామన్ అదే ఫీట్ చేయబోతున్నారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.

జనవరి 15న మార్కెట్‌కు తాళం

బడ్జెట్ కంటే ముందే ఇన్వెస్టర్లు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. జనవరి 15, 2026 (గురువారం) నాడు షేర్ మార్కెట్‌కు పూర్తి సెలవు ప్రకటించారు. మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. దీనితో NSE, BSE తమ ట్రేడింగ్ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఈ రోజున ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ జరగదు. అయితే కమోడిటీ మార్కెట్ మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి పనిచేస్తుంది.

సందడి మొదలైంది

బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. అనంతరం ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెడతారు. మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనాలు దక్కుతాయా? లేదా కొత్త పథకాలు ఏమైనా ఉంటాయా? అని అందరూ వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News