పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద అంతకంతకూ పెరుగతోంది. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వే దగ్గర గోదావరి పది అడుగుల ఎత్తుకు చేరడంతో ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు గ్రామస్తులు. అటు రంగంలోకి దిగిన అధికార యంత్రాగం ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 26 అడుగులు ఉండగా.. సాయంత్రం తరువాత అది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వరద పెరిగితే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పోలవరం ఏజెన్సీలోని గ్రామాలు ముంపుకు గురవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వరదకు స్థానికంగా ఉన్న పంట పొలాలు నీట మునిగాయి.పోలవరం కాఫర్ డ్యాం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సుమారు రెండు లక్షల 50 వేల క్యూసెక్కుల వరద నీరు కాఫర్ డ్యాం నుండి వేగంగా దిగువకు ప్రవహిస్తోంది. గంటల వ్యవధిలోనే వేల నుంచి లక్షల క్యూసెక్కుల్లోకి వరద ప్రవాహం పెరిగింది.