దేవుడు ఆడే ఆటని అర్థం చేసుకోవడం కష్టం: ఎస్ ఎం కృష్ణ భావోద్వేగం

Update: 2019-07-31 10:05 GMT

పుడుతూనే బంగారు స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టారు విజీ సిద్ధార్థ. మూడొంద ఎకరాల కాఫీతోటలను 15వేల ఎకరాలకు విస్తరింపజేసిన ఘనత ఆయనది. అంతర్జాతీయ స్థాయిలో కేఫ్ కాఫీడేలను నెలకొల్పారు. ఘుమ ఘుమలాడే కాఫీ తాగుతూ ప్రపంచ విషయాలన్నీ మాట్లాడుకునేందుకు కాఫీడేనే వేదికగా మారేది. పట్టిందల్లా బంగారం కోట్లలో వ్యాపారం.. అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్. ఇంకేం కావాలి. అయినా ఏదో అలజడి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు. తట్టుకోలేక తల్లడిల్లిన గుండె. వెరసి సిద్ధార్థ ఆత్మహత్యకు పురిగొల్పింది. ఆయన అదృశ్య వార్త బెంగళూరు నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆయన ఆత్మహత్య వార్త పారిశ్రామికవేత్తలను కలచివేసింది.

సిద్ధార్థ మామ, బీజేపీ అగ్రనేత ఎస్ఎం కృష్ణ నివాసం 'శాంభవి' పలకించేవారి రాకపోకలతో కిటకిటలాడుతోంది. వరుస పరామర్శలతో ఆయన నివాసంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయనను కలిసిన బంధుమిత్రుల దగ్గర "దేవుడు ఆడే ఆటలను అర్థం చేసుకోవడం కష్టం" అని కృష్ణ వాపోయారు. ఆయనను పరామర్శించిన వారిలో కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రులు డీకే శివకుమార్, సినీ ప్రముఖులు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కాగా, సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నదిలో లభ్యమైంది. అంత్యక్రియలు సిద్దార్థ తండ్రికి చెందిన కాఫీ ఎస్టేట్‌లో చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారని శృంగేరీ ఎమ్మెల్యే రాజేగౌడ తెలిపారు.

Similar News