నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సబ్ జైలర్ సుధాకర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇ ఇసుక వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆడియో బయటకు రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సబ్ జైలర్ సుధాకర్‌రెడ్డి... తాను ఊర్కోండపేట ఎస్సైనని.. నువ్వు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నావు కాబట్టి తనకు డబ్బులు ఇవ్వాలని ఓ ఇసుక వ్యాపారిని బెదిరించాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జైలర్ సుధాకర్‌రెడ్డిపై వేటు పడింది.
సబ్ జైలర్ ఆది నుంచి వివాదాస్పదుడే. కల్వకుర్తి సబ్ జైలర్‌గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌రెడ్డి.. ఇటీవల సెలవుపై వెళ్లాడు. సెలవు అయిపోయాక డ్యూటీకి ఆలస్యంగా వచ్చాడు. తాను డ్యూటీలో ఆలస్యంగా జాయిన్ అయ్యానన్న విషయం పై అధికారికి ఎందుకు చెప్పావంటూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. నానా దుర్భాషలాడడంతో పోలీస్ స్టేషన్‌లో సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు కూడా చేశాడు.
అంతే కాదు సుధాకర్‌రెడ్డి నయీం అనుచరుడు పాశం శ్రీను కేసులోనూ సస్పెండ్ అయ్యాడు. కొంత కాలం చర్వా సబ్ జైలర్‌గా పని చేసిన సుధాకర్‌రెడ్డి.. తిరిగి కల్వకుర్తి సబ్ జైలర్‌గా జాయిన్ అయ్యాడు. వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ అదే తతంగాన్ని ప్రారంభించాడు.