లాడెన్‌ కొడుకు హంజా మరణం!

Update: 2019-08-01 03:29 GMT

లాడెన్ మరణం తరువాత అమెరికాకు మోస్ట్ వాంటెడ్ గా మారిన లాడెన్ కుమారుడు, అల్ ఖైదా చీఫ్‌ హంజాబిన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఎన్‌బీసీ న్యూస్‌ సంస్థ వెల్లడించింది. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్‌ అధికారులు తెలిపినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే వైట్ హౌస్ వర్గాలు మాత్రం హంజా మరణాన్ని ధ్రువీకరించలేదు. అతని ఆచూకీ చెప్పినా, పట్టించిన వారికి భారీ రివార్డు ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించింది. హంజాబిన్ లాడెన్ తలపై అమెరికా మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.

ఒసామా బిన్‌ లాడెన్‌ హత్య అనంతరం హంజాబిన్ అల్ ఖైదాను ముందుండి నడిపించాడు. లాడెన్ 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. లాడెన్ పై అబోత్తాబాద్ ఇంట్లో దాడి జరిపినపుడు హంజాబిన్ లాడెన్ (29) కనిపించలేదు. ఆ సమయంలో అతను అక్కడినుంచి తప్పించుకున్నాడు.. తొలుత పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్‌, సిరియాల్లోకి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. తాజాగా అతను మరణించాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం సస్పెన్స్ గా మారింది.

Similar News