వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. 20 రోజులకిందటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. కానీ అంతలోనే భర్తను దారుణంగా హతమార్చింది భార్య. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా టీవీ నగర్ లో గురువారం జరిగింది. టీవీ నగర్ లో నివాసం ఉండే దక్షిణా మూర్తి, మారియమ్మాల్ దంపతులకు సంతానం లేరు. దాంతో 20 ఏళ్ల కిందట సేతుపతిని దత్త పుత్రుడిగా స్వీకరించారు. అతను రెండేళ్లుగా దిండివనంకు చెందిన మురుగవేణిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. ఈ క్రమంలో 20 రోజుల కిందట పెద్దలను ఒప్పించి బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే హఠాత్తుగా ఏమైంది ఏమో గురువారం రాత్రి వారి ఇంట్లో నుంచి మంటలు వ్యాపించాయి, ఇల్లంతా తగలబడింది.
చుట్టుపక్కల వారు మంటలను అదుపుచేశారు. అయితే ఇంట్లో సేతుపతి కాలిపోయి పడివున్నాడు. పైగా ఇంటిబయట గడియపెట్టి ఉంది, ఆ సమయంలో అతని భార్య మురుగవేణి లేదు. దాంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మురుగవేణిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సేతుపతి రోజు మద్యం సేవించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అనుమాన పడడం, రాత్రివేళల్లో తిట్టడం వంటివి చేస్తున్నాడని.. దాంతో విసుగుచెంది మద్యం మత్తులో ఉన్న సేతుపతిని నిద్రిస్తుండగా ఇంటికి నిప్పంటించి సజీవదహనం చేశానని ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది.