తుంగభద్ర జలాల కోసం కత్తులుపట్టి నదికి వెళ్లిన 800 మంది రైతులు

Update: 2019-08-04 09:28 GMT

అతివృష్టి, అనావృష్టితో తాము పంటలు నష్టపోకుండా చల్లగా చూడాలంటూ.. రైతులంతా వేటకొడవళ్లు చేతపట్టి దేవుడికి పూజలు చేశారు. గోవిందా.. గోవిందా.. అంటూ భగవన్నామస్మరణతో మార్మోగించారు. ఈ వింత ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో జరిగింది. వర్షాలు బాగా పడాలని ప్రార్థిస్తూ ఏటా రైతులు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామానికి చెందిన దాదాపు 800 మంది రైతులు.. వేటకొడవళ్లు, మారణాయుధాలు చేతపట్టి తుంగభద్ర నది నీటి కోసం వెళ్లారు. అక్కడి నుంచి నీటిని పట్టుకుని.. 30 కిలోమీటర్లు కాలినడకన ఊరికి వస్తారు. గ్రామంలోని శ్రీగుంటి రంగస్వామికి ఆ తుంగభద్ర నీటితో జలాభిషేకం చేశారు. ఇలా చేస్తే.. ఊరందరికీ మంచి జరుగుతుందని నమ్మకం.

తుంగభద్ర జలాలు తీసుకుని వస్తున్న వారి పాదస్పర్శతో పాపాలు తొలిగిపోతాయని ఇక్కడివారు నమ్ముతారు. అందుకే చిన్నాపెద్దా అంతా వారికి అడ్డంగా రోడ్డుపై పడుకుంటారు. ఏటా శ్రావణమాసం తొలి శనివారం ఇలా చేయడం ఆచారంగా వస్తోంది. ఈ కార్యక్రమం చూసేందుకు చుట్టుపక్కల నుంచి కూడా వేలాది మంది తరలిరావడంతో.. ఊరు జనసంద్రమైంది.

Similar News