తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులోకి, కుంటల్లోకి భారీగ వరద నీరు చేరుకుంది. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తూ ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొమ్మారపు చెరువుకు 2 రోజుల కిందట గండి పడడంతో నీరు మొత్తం వృధాగా పోతోంది.
గతేడాది కూడా ఇలాగే జరిగితే రైతులంతా కలిసి సిమెంట్ సంచులతో ఇసుకను నింపి నీరు దిగువకు వెళ్లకుండా అడ్డువేశారు. అవన్నీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈ చెరువు కింద సుమారు 1400 వందల ఎకరాల భూములు సాగుచేస్తున్నారు. కానీ రెండు రోజుల నుండి నీరు వృథగా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.