మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయినా రావాల్సి ఉంది. పైగా రాజకీయాల్లో ఓ రకంగా ప్రణబ్ ఆయనకు గురువు కూడా. కానీ మన్మోహన్ సింగ్ కూడా రాకపోవడం ఆసక్తిరేపుతోంది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ఈ వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్ ఈ పార్టీ అధికారంలో ఉండగానే రాష్ట్రపతి పదవి సైతం పొందారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ నేతలకు సలహాలు ఇస్తూ వచ్చిన ఆయన.. తర్వాత మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దూరం జరిగారు. ఎన్డీయే ప్రభుత్వానికి ఆయన అనుకూలంగా వ్యవహరించారన్న చర్చ జరిగింది. రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత ఆర్‌ఎస్ఎస్ సమావేశానికి వెళ్లి ప్రసంగించడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. సోనియా, రాహుల్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆయన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఇందులో భాగంగానే ఆయన అత్యున్నత అవార్డు అందుకున్న సమయంలో కాంగ్రెస్ నేతలు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.