మళ్లీ ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. భయం గుప్పిట్లో ప్రజలు

Update: 2019-08-17 04:12 GMT

కృష్ణా నది వరద ప్రవాహం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలను దాటుకుని ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి ఉరకలెత్తుతోంది. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులోని కరకట్టల వెంబడి ఉన్న గ్రామాలు, పొలాలు, రహదారులను ముంచెత్తుతోంది. గంటగంటకూ వరద ఉద్ధృతి పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ 7వేల ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయి.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరదనీటి ప్రవాహం భారీగా వస్తుండడంతో 8లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వరద తీవ్రత మరింత పెరగడంతో విజయవాడ నగరంలోని కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌ కట్ట దిగువున ఉన్న నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. పెనమలూరు మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామల్లో నదికి ఆనుకుని ఉన్న ఇళ్లు, పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ ప్రాంతాల వారిని అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. కృష్ణా జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం 40 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలోకి వదర నీరు ముంచెత్తింది. దీంతో ఊళ్లో నుంచి పునరావాస కేంద్రానికి పడవలో ఓ కుటుంబం బయలుదేరగా ఇంతలో గేదె అడ్డు రావడంతో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. తులసీప్రియ అనే బాలిక గల్లంతు అయ్యింది.

గుంటూరు జిల్లాలో 12 మండలాల్లోని 39 గ్రామాల్లో వరద ప్రభావం పడింది. లంకలకు వెళ్లే మార్గాలు కోతకు గురయ్యాయి. అమరావతిలోని ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయం వరకు కృష్ణానది వరద చేరింది. ఇప్పటివరకు 8 పునరావాస కేంద్రాల ద్వారా 1,619 మందికి ఆశ్రయం కల్పించారు. 537 నివాసాలు ముంపు బారిన పడ్డాయి. 88 విపత్తు నిర్వహణ బృందాలు సేవలు అందిస్తున్నాయి.

అటు నాగార్జునసాగర్‌ నుంచి నీటి విడుదల పెరగడంతో సాగర్‌ దిగువభాగంలో పాతవంతెన సమీపంలో విజయపురిసౌత్‌ వైపు నుంచి మాచర్ల-హైదరాబాద్‌ మార్గానికి వెళ్లే అనుసంధాన రహదారి కింద మట్టి కోతకు గురైంది. ముందు జాగ్రత్తగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

Full View

Similar News