TS : వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త

Update: 2024-04-30 04:42 GMT

తెలంగాణ అగ్నిగోళంలా మండిపోతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వడగాలులు వీయడంతో పాటు భగ్గుమంటున్న ఎండలతో నిన్న వడదెబ్బకు గురై ఐదుగురు చనిపోయారు. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండగా.. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న అత్యధికంగా నిజామాబాద్‌లో 43.8 డిగ్రీలు, ఖమ్మంలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్ రోడ్లు కూడా జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బయట ఉష్ణోగ్రతలతో రూమ్ టెంపరేచర్లు కూడా విపరీతంగా పెరగడంతో ఇంట్లో ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. 40-44 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 173 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 90 మండలాల్లో తీవ్ర వడగాలులు, 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. తీవ్రతను బట్టి పలు మండలాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Tags:    

Similar News