PAWAN: ఓటుతో కొడితే వైసీపీ కుంభస్థలం బద్దలు కావాలి
ప్రజలకు జనసేనాని పిలుపు... జగన్‌ను సాగనంపాలని విజ్ఞప్తి;
అభివృద్ధి చేయడం చేతకాని, ఉపాధి అవకాశాలు కల్పించని జగన్‌ను సాగనంపాలని జనసేన అధినేత పవన్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో పవన్ పాల్గొన్నారు. ప్రజల భూములు దోచుకోవడానికి జగన్ ప్రమాదరకమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసుకొస్తున్నారన్నారు. దీని ప్రకారం ఆస్తుల ఒరిజినల్ పత్రాలు జగన్ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇచ్చి ఆస్తుల వివరాలన్నీ హైదరాబాద్ నానక్‌రామగూడలోని వైసీపీ ప్రైవేటు స్థావరంలో దాచిపెడుతున్నారని ఆరోపించారు. ఈసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలపెట్టుకున్నట్టేనని హెచ్చరించారు. అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్‌కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామనిపవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న ఓటుతో కొడితే వైసీపీ కుంభస్థలం బద్ధలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు.
తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ కొట్టు కట్టేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాడేపల్లిగూడేన్ని ఎడ్యుకేషన్, మార్కెట్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని జగన్ దోచుకున్నారని పవన్ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. సంక్షేమనిధికి వ్యక్తిగతంగా కోటి విరాళం ప్రకటించారు.
మరోవైపు జనసేన పోటీలో లేనిచోట గాజుగ్లాసును ఫ్రీ సింబల్స్‌లో జాబితాలో పెట్టి స్వతంత్రులకు కేటాయించడంపై కూటమిలోని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓట్లు చీల్చేందుకు వైసీపీయే ఈ కుట్రకు తెర తీసిందని ఆరోపించాయి. కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నచోటే స్వతంత్రులకు గ్లాసు గుర్తును కేటాయించారని మండిపడ్డాయి. జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. తెలుగుదేశం, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. N.D.A కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైసీపీనే ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట్ల.. స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులకు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.