కోటి మందికి సభ్యత్వం ఇవ్వాలి : కేటీఆర్

Update: 2019-08-21 14:02 GMT

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కోటి మందికి సభ్యత్వం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు టార్గెట్ విధించారు గులాబీ బాస్ కేసీఆర్. ఒక్కో నియోజకవర్గంలో 50 వేలకు తక్కువ కాకుండా సభ్యత్వాన్ని నమోదు చేయించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. రాష్ట్రమంతా సభ్యత్వ నమోదులో దూసుకు పోయిన టీఆర్ఎస్... గ్రేటర్‌ హైదరాబాద్‌ లో వెనుకబడింది. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలతో పాటు వంద మంది కార్పొరేటర్లు ఉన్నా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నేతలకు క్లాస్ తీసుకున్నారు. మరికొంత గడువుకూడా ఇచ్చారు. అయినా సభ్యత్వ నమోదు విషయంలో నేతల్లో ఏ మార్పు కన్పించలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది.

వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ భావించింది. అందుకే పార్టీ సభ్యత్వం ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. దాదాపు కోటి మంది జనాభా ఉన్న రాజధానిలో 15 లక్షలకు తక్కువ కాకుండా క్రియాశీల, సాధారణ సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు. రాష్ట్రమంతటా సభ్యత్వం ఘనంగా సాగినా, గ్రేటర్‌లో మాత్రం టార్గెట్ రీచ్ కాలేక పోయింది. సభ్యత్వ నమోదును గడుపు లోపు పూర్తి చేయించాలని కేటీఆర్ ఆదేశించడంతో నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ, మల్లారెడ్డి లు రంగంలోకి దిగారు. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా కార్పొరేటర్లు, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీలతో సమావేశాలు నిర్వహించారు. అయితే ఇవేమీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు.

చాలా మంది నేతలు, కార్పొరేటర్లు సభ్యత్వ నమోదును అంతగా సీరియస్ గా తీసుకోలేదనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించపోవడంపై కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక డివిజన్లలో కూడా ఎమ్మెల్యేలే పెత్తనం చెలాయిస్తున్నారన్న అభిప్రాయం కార్పొరేటర్లలో ఉంది. దీంతో ఎమ్మెల్యేలే అంతా చూసుకుంటారులే అన్న ధీమాలో వారున్నట్లు తెలుస్తోంది. సభ్యత్వాలను చేయిస్తే, ఆర్థిక భారం కూడా తమ మీదే పడ్తుందనే భయం కూడా వారిలో ఉంది. ఇక కొంత మంది నేతలు, కార్పొరేటర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డారు. కొన్ని చోట్ల వారికి ఇష్టం లేని అభ్యర్థులను పార్టీ నిలబెట్టింది. ఎమ్మెల్యేలు, నేతలు, కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేకపోవడం కూడా సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపిందని పార్టీ వర్గాలంటున్నాయి.

సభ్యత్వ నమోదులో కార్పొరేటర్లు వెనుకబడటంపై తెలంగాణ భవన్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్ ఆలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు వారం రోజుల క్రితం సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్ల అలసత్వంపై తలసాని, బొంతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదులో వెనుక బడితే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవన్న సంకేతాలు కూడా ఇచ్చారు. సోమవారం వరకే సభ్యత్వ నమోదును పూర్తి చేసి పుస్తకాలు తెలంగాణ భవన్ లో అందించాలని ఆదేశించారు. ఇక డివిజన్ స్థాయి కమిటీలు ఈనెల 24 కల్లా పూర్తి చేయాలని సూచించారు. అయితే ఇప్పటివరకు 50 శాతం కూడా టార్గెట్ రీచ్ కాలేదంటే గ్రేట‌ర్ లో నేత‌ల మ‌ధ్య ఎంత స‌మ‌న్వయ లోపం ఉందో ఇట్టే అర్ధం అవుతోంది.

పదేపదే సభ్యత్వ నమోదుపై హెచ్చరిస్తున్నా కూడా గ్రేటర్ నేతలు లైట్ గా తీసుకోవడంపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. గురువారం మరోసారి గట్టిగా వార్నింగ్‌ ఇవ్వాలని ఆయన డిసైడ్‌ అయ్యారు.

Similar News