తిరుమలలో అన్యమతప్రచార కలకలం

Update: 2019-08-23 08:13 GMT

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల అన్యమత ప్రచారం కలకలం రేపింది. దీన్ని నిరసిస్తూ.. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రకటనలేంటంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చట్టలు తీసుకురావాలన్నారు.

శ్రీవారి ఆలయానికి సమీపంలోని రాంబగీచా బస్టాండ్ టికెట్ కౌంటర్‌లో జారీ చేసే టికెట్ల వెనుక భాగంలో హజ్, జరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలున్నాయి. ఇది గుర్తించిన భక్తులు ఆర్టీసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నష్ట నివారణ చర్యలపై అధికారులు దృష్టి సారించారు. ఉద్దేశపూర్వకంగా ఇవి జారీ చేయలేదని... పొరపాటున నెల్లూరుకు చెందిన 5 టింబర్లు ఇక్కడకు వచ్చాయని.. వాటిని వెంటనే తిరిగి పంపామని తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిదర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా.. భక్తులు మనోభవాల దృష్టిలో పెట్టుకుని దీనిని సీరియస్ గా తీసుకున్నట్టు తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు. త్వరలోనే దీనికి బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులంతా శ్రీవారి భక్తులేనని.. అయితే జరిగిన పొరపాటుపై విచారణ జరుపుతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

అటు తిరుమలలో జరిగిన ఈఘటనపై ఆర్ఎస్ఎస్, హిందూ సంస్థలు భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా హిందూ సంస్థల ప్రతినిధులు టీటీడీ, ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా కాకుండా... మత ప్రచారకుడిగా మారారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు కడుతున్న పన్నులతో జగన్ జెరూసలేం వెళ్లతారా? బీజేపీ ఏపీ విభాగం వెంటనే మేలుకుని దీనిపై స్పందించాలని రతన్ శార్ద అనే కార్యకర్త డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, సునీల్ డియోదర్ లకు ట్విట్టర్ ట్యాగ్ చేశారు రతన్.

Similar News