ఏపీ రాజధాని మార్పుపై అగ్గిరాజేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. రోజుకో స్టేట్ మెంట్ తో ఆ సెగను కంటిన్యూ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలకు భూములున్నాయంటూ ఆరోపణలపర్వం మొదలు పెట్టిన మంత్రి.. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మరో ప్రకటన చేశారు. బీజేపీ నేత సుజనాచౌదరి, చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడికి ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. ల్యాండ్‌పూలింగ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు బొత్స.
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నాయకుడు శ్రీభరత్ ఖండించారు. 2008లోనే యూరియా, ఫెర్టిలైజర్స్ ప్రాజెక్టు ప్రారంభించడానికి తాము అప్లై చేశామన్నారు. 2004 నుంచి 2009 వరకు బొత్స కేబినెట్ మినిస్టర్‌గానే ఉన్నారని.. ఆయనకు తెలియకుండా భూములు ఇచ్చారా అని భరత్ ప్రశ్నించారు. తన మీద బురద జల్లి అమరావతి భవిష్యత్తుతో ఆటలాడేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని భరత్ మండిపడ్డారు.
రాజధాని తరలింపు వివాదం ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు అమరావతి నుంచి రాజధాని తరలింపుపై పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచనేది వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. దీనిపై తనకు పూర్తి సమాచారం ఉందని చెప్పారు. రాజధాని తరలింపు గందరగోళంపై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిని తరలిస్తే ఉరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరిస్తున్నారు రైతులు.