TG: ఆస్పత్రుల్లో రోగులకు తప్పని గ్యాస్ కష్టాలు
వెంటాడుతున్న గ్యాస్ కష్టాలు
తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆస్పత్రులను సైతం గ్యాస్ కొరత కష్టాలు వెంటాడుతున్నాయి. ఉదాహరణకు.. 330 పడకలున్న సిరిసిల్ల బోధనాస్పత్రిలో రోజూ కనీసం 150 మంది ఇన్‌పేషెంట్లు ఉంటారు. నిత్యం వారికి మూడుపూటలా డైట్ ఇవ్వాలంటే రోజుకు కనీసం ఒక గ్యాస్ సిలిండర్ అవసరం. అయితే ఆ బోధనాస్పత్రి పేరిట ఇంతవరకు ఒక్క గ్యాస్ కనెక్షన్ కూడా లేదు. సంబంధిత డైట్ కాంట్రాక్టరే బహిరంగ మార్కెట్లో సిలిండర్ కొని కాలం గడుపుతున్నారు. ఇన్నాళ్లూ వాణిజ్య సిలిండర్లు దొరుకుతుండడంతో ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారడంతో సమస్య మొదలైంది. గ్యాస్ సిలిండర్స్ దొరక్కపోవడం, బ్లాక్‌లో కొందామన్నా భరించలేనంత అధిక ధరలు చెబుతుండడంతో.. ‘‘ఇలాగైతే రోగులకు డైట్ అందించలేం’’ అని సదరు కాంట్రాక్టర్ తెగేసి చెప్పినట్లు సమాచారం. సిరిసిల్లకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి. అక్కడ కూడా ఆస్పత్రి పేరిట గ్యాస్ కనెక్షన్ మంజూరు కాలేదు. ఆ బాధలేవో డైట్ కాంట్రాక్టర్లే పడేవారు. ఇప్పుడు గ్యాస్ దొరక్కపోవడంతో వాళ్లు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆస్పత్రుల పేరిట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించాలని సంబంధిత ఆస్పత్రుల సూపరింటెండెంట్స్పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితే నెలకొంది. నిబంధనల మేరకు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికీ సంబంధిత సూపరింటెండెంట్ పేరిట గతంలోనే ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. రోజూవారీ వాడే గ్యాస్ ఆధారంగా సిలిండర్స్‌ను గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేస్తుంటాయి.
వంట నూనెలపై సైతం యుద్ధం ప్రభావం
ఇరాన్ యుద్ధం గ్యాస్ ధరలపైనే కాదు వంట నూనెలపై సైతం ప్రభావం చూపిస్తుంది. ఇరాన్-ఇజ్రా యెల్, అమెరికా యుద్ధాల ప్రభావంతో వంటకు ఉపయోగించే ఆయిల్ ధరపై ఎఫెక్ట్ చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో రెండు వారాల కిందట ధరలతో పోల్చుకుంటే.. ప్యాకెట్‌కు పది రూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. దాంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. వంట నూనె తప్పనిసరి కాబట్టి.. ఎక్కువ పెట్టైనా తప్పక కొన్సాల్సిన పరిస్థితి నెలకొంది.
యుద్ధం కొనసాగితే వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాకు వంట నూనెకు సంబంధించిన ముడిసరుకు జలమార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధం రాకముందే సాధారణంగానే వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. ఆ మధ్య లీటర్ ప్యాకెట్ ధర రూ.120కి తక్కువగా ఉండగా.. కొన్ని రోజులకు రూ.14-150కి చేరింది. ఇప్పుడు లీటర్ ప్యాకెట్ ధర రూ.170గా ఉంది. దీనికి పది రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు.