వైసీపీ బాధితుల కోసం టీడీపీ కీలక నిర్ణయం

Update: 2019-09-03 12:11 GMT

వైసీపీ నేతలకు దమ్ముంటే తనపై దాడి చేయాలని సవాల్‌ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక...వంద రోజుల్లో దాదాపు 5వందల అరాచకాలకు పాల్పడిందంటూ ఫైరయ్యారు. గుంటూరు జిల్లా అరండల్‌పేట్‌లో పల్నాడు బాధితుల కోసం పునరావాస శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా చంద్రబాబు ... వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని పులివెందుల పంచాయతీగా మారుస్తామంటూ చూస్తూ ఊరుకోబోమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ బాధితుల కోసం గుంటూరులో పునరావాసం ఏర్పాటు చేశారాయన. అక్కడ తలదాచుకుంటున్న తమ్ముళ్లను పరామర్శించారు. వాళ్ల సాధక, బాధలు తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో ఎటుచూసినా అరాచకాలే కనిపిస్తున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు చంద్రబాబు. ఇందుకు సీఎం జగనే బాధ్యత తీసుకోవాలన్నారు.

ఏపీని వైసీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారని.. వాక్‌ స్వాతంత్ర్యాన్ని హరించి వేస్తున్నారని ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. చెప్పిన పనులు చెయ్యకుంటే.. ఏ ఒక్కరూ విడిచిపెట్టరని హెచ్చరించారు. టీడీపీ లీడర్లు.. కేడర్‌కు అండగా నిలవాలని.. అవసరమైతే వాళ్ల తరఫున జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు చంద్రబాబు

వైసీపీ వాళ్లకు ధైర్యం ఉంటే తనపై దాడి చేయండంటూ సవాల్‌ విసిరారు చంద్రబాబు. అదే సమయంలో పోలీసులు సైతం తమ బాధ్యతల నుంచి పారిపోలేరని అన్నారాయన. టీడీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశామని గుర్తుచేశారు. ఇప్పుడేమో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ బాధితులంతా వాళ్ల స్వగ్రామాలకు, సొంతింటికి తిరిగి వెళ్లేలా చూసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు.

Similar News