చిదంబరానికి భయంకరమైన షాక్

Update: 2019-09-06 01:30 GMT

ఆయన సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్.. చట్టాలు, సెక్షన్లు, కేసులు ఆయనకు కొట్టిన పిండి. బడా బడా కేసులను ఒంటి చేత్తో వాదించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులను గడగడలాడించారు. తన అనుకున్న వాళ్లను జైళ్లకు పోకుండా కాపాడుకున్నారు. ప్రత్యర్థులకు కారాగారవాసం రుచి చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పేరు చెబితేనే హడల్ పుట్టేలా వ్యవహరించారు. కానీ, కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు. ఓడలు బళ్లు, బళ్లు ఓడలవుతాయి. పరపతి పిసరంత కూడా ఉపయోగపడదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఇదే. కేంద్ర హోంమంత్రిగా, ఆర్థికమంత్రిగా పెత్తనం చెలాయించిన ఆ వ్యక్తి, ఇప్పుడు చట్టం చేతిలో చిక్కి నలిగిపోతున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ లను తన కనుసన్నల్లో నడిపించిన లీడర్, ఇప్పుడు వాటి కళ్లల్లో పడి ఊచలు లెక్కబెడుతున్నారు. కోర్టులనే కంగారు పెట్టించిన ఆ పొలిటికల్ లాయర్, ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాలతోనే జైలుకు వెళ్లారు. హీ ఈజ్ నన్ అదర్ దేన్.. చిదంబరం.

Full View

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరానికి భయంకరమైన షాక్. INX మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కోర్టు చిదంబరానికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈనెల 19 వరకు ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. సీబీఐ కస్టడీలోనే ఉంటానంటూ చిదంబరం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసి పుచ్చింది. విచారణకు సహకరిస్తున్నానని, జైలుకు పంపాల్సిన అవసరం లేదని చిదంబరం వేడుకున్నా లాభం లేకపోయింది. కస్టడీ గడువు ముగిసినందున తరువాతి ప్రాసెస్ జ్యుడీషియల్ కస్టడీనే అంటూ సీబీఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆయన్ను జైలుకు తరలించాలని ఆదేశించింది.

INX మీడియా కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు గత నెలలో చిదంబరాన్ని అరెస్టు చేశారు. అనంతరం ఆయన 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. కస్టడీ గడువు ముగియడంతో చిదంబరాన్ని కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ను జైలుకు పంపకుండా ఉండడానికి లాయర్లు శతవిధాల ప్రయత్నించారు. ముందుగా బెయిల్ కోసం వాదించిన న్యాయవాదులు, ఆ తర్వాత కస్టడీ గడువు పొడిగించాలని కోరారు. ఈ ప్రయత్నాలను సీబీఐ తరఫు న్యాయవాది తుషార్ మెహ్‌తా అడ్డుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, చివరికి జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

వాస్తవానికి సుప్రీంకోర్టులోనే చిదంబరం భవితవ్యం తేలిపోయింది. చిద్దూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణ కీలక దశలో ఉన్నందున ఈ సమయంలో బెయిల్ ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసులో సేకరించిన ఆధారాలను దర్యాప్తు అధికారులు సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. ఐతే, కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉన్నందున బెయిల్ ఇవ్వాలని చిదంబరం తరపు న్యాయవాదులు కోరగా, అందుకు కోర్టు ఒప్పుకోలేదు. కావాలంటే సీబీఐ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. దాంతో తాను లొంగిపోతానని చిదంబరం విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో ద్వారాలు మూసుకుపోవడంతో దర్యాప్తు అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని తీహార్ జైలుకు తరలించారు. చిదంబరానికి 7వ నెంబర్‌ జైలు కేటాయించారు.

తీహార్ జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోర్టుకు చిదంబరం విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కోర్టు, ప్రత్యేక సెల్ ఇవ్వాలని సూచించింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో మాత్రం చిదంబరం, కార్తీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ అరెస్టు నుంచి వారిద్దరికీ రక్షణ లభించింది. చిదంబరం, కార్తీలకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

చిదంబరాన్ని జైలుకు పంపడంపై కార్తీ చిదంబరం నిర్వేదంగా మాట్లాడారు. ఇది తాము ఊహించిందేనన్నారు. గత ఏడాది తనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పారు. జైలుకు వెళ్తున్న సమయంలోనూ చిదంబరం వెనక్కి తగ్గలేదు. జైలుకు వెళ్లడం గురించి తాను భయపడడం లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించే తాను భయపడుతున్నానంటూ డాంబికం ప్రదర్శించారు.

Full View

Similar News