ముంబైపై వరుణుడి దాడి కొనసాగుతోంది. దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత భారీ వర్షాలతో మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాడు. ముంబై, థానే, పూణే, పాల్ఘర్, కొంకణ్ తీరాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. సియాన్ రోడ్డు, వడాల రోడ్డు, గాంధీ మార్కెట్, మిలాన్ సబ్ వే, కుర్లా డిపో, అన్ టాప్ హిల్ సెక్టార్లు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరింది. అపార్ట్‌మెంట్ సెల్లార్లు నీట మునిగి పోయాయి. లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Watch Fast News in 3Minutes :
ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. రైల్వేస్టేషన్లు కూడా జలదిగ్భంధమయ్యాయి. వరద నీటితో రైల్వే ట్రాక్‌లు మునిగిపోయాయి. దాంతో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జోరువానల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలను మూసేశారు. వర్షాలు-వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తున్నారు.