ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు.. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ.. వృద్దులకైతే పింఛన్ పెంచుతామంటారు.. రైతులకైతే రాయితీలు ఇస్తామంటారు. మరి యూత్‌ని ఆకర్షించాలంటే ఉద్యోగాల కల్పనే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఉద్యోగం మాట దేవుడెరుగు కానీ ముందు మీకైతే స్మార్ట్ ఫోన్ ఇస్తాం. మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని గత ఎన్నికల్లో పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ వాగ్ధానం చేసింది. మరి అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది. సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ గెలుపొందారు. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. డిసెంబర్ నుంచి దశల వారిగీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముందుగా 11,12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఫోన్లు అందజేస్తారు. సరికొత్త ఫీచర్లతో యువతకు సాంకేతికత వైపుకు అడుగులు వేయించేలా చేస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారన్ని ఫోన్ ద్వారా అందిస్తామని అంటున్నారు.