సినిమాలు మనుషులపై ప్రభావం చూపిస్తాయా.. అలా అయితే మంచి సినిమాలు ఎన్నో వచ్చాయి కదా.. మనుషులు మారలేదే అని వితండ వాదం చేస్తుంటారు కొందరు. మంచి ఎక్కదు మహాప్రభో.. చెడు ఎక్కినంత ఈజీగా అని చెవినిల్లు పోరినా వినిపించుకోరు. మంచి చెడు విచక్షణ పెద్ద వాళ్లే కోల్పోతున్నారు. మరి అభం శుభం తెలియని చిన్నారుల పరిస్థితి ఏంటి. మంచి చూపించకపోయినా మానేయండి.. చెడు మాత్రం చూపించకండి అంటే ఎవరు చూస్తారండి.. అయినా సమాజంలో జరిగేవే కదా మేమూ చూపించేది అంటారు. ఇలా ఎవరి వాదనలు వారివే అయినా బలైపోయేది మాత్రం బాల్య జీవితాలే అని ఈ ఉదంతం మరోసారి రుజువు చేస్తుంది.
టీవీలో వచ్చే ఓ సినిమాని చూసి ప్రేమలో పడ్డారు 13 ఏళ్ల వయసున్న బాలిక, 12 ఏళ్ల వయసున్న బాలుడు. యూపీ అలీగఢ్‌కు చెందిన ఈ పిల్లలిద్దరని పోలీసులు పట్టుకుని ఆరా తీసారు. ఇంట్లో పెద్ద వాళ్లకు చెబితే పెళ్లి చేయమన్నారని దాంతో పారిపోయి ఇలా రైలెక్కామన్నారు. దూరంగా ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుని కాపురం చేయాలనుకున్నామని చెప్పారు. పోలీసులకు పట్టుబడితే అన్నా చెల్లెళ్లమని, తల్లిదండ్రులు కొడుతుంటే పారిపోయి వస్తున్నామని చెప్పాలనుకున్నట్లు పెద్ద స్కెచ్చే గీసి పెట్టుకున్నారు ఆ చిన్ని బుర్రల్లో. కాగా పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించే నిమిత్తంగా చైల్డ్‌లైన్‌కు తరలించారు. ఈ లోపు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి పిల్లల్ని తీసుకెళ్లే వరకు చైల్డ్‌లైన్ సంరక్షణలో ఉంచారు పిల్లలిద్దరినీ.