ఇమ్రాన్ ఖాన్‌ను బలవంతంగా దింపేస్తారా?

Update: 2019-10-04 05:21 GMT

పాకిస్థాన్‌లో పాలకుల కంటే సైన్యం నిర్ణయమే శిరోధార్యంగా మారుతుంది. అక్కడ ఆర్మీ అధికారులు చెప్పిందే నేతలు వినాలి. వీరి కనుసన్నల్లోనే పాలన ఉంటుంది. రాజకీయనాయకులను ప్రజలు ఎన్నుకుంటారు. కానీ పెత్తనమంతా సైన్యానిదే. పాకిస్తాన్ ప్రభుత్వాలను దించి.. తామే అధ్యక్షులుగా అవతరించారు గతంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షులు. ఇప్పుడు కూడా అలాంటి సంకేతాలే అందుతున్నాయి. సైనికుల సాయంతోనే అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ కు ఇప్పుడు ఆ సైనికులే వెన్నుపోటుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది.

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా సమావేశమయ్యారు. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మూడుసార్లు వీరితో ఆయన సమావేశమైనట్టు తెలుస్తోంది. పాక్ ఆర్ధిక రాజధాని కరాచీ, రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆర్ధిక సంక్షోభం, ద్రవ్యోల్బణం గురించి చర్చ జరిగితే ప్రధాని కార్యాలయంలో జరగాలి. కానీ అలా కాకుండా.. ఇమ్రాన్ ఖాన్ లేకుండా కేవలం ఆర్మీ ఛీఫ్ సమావేశం కావడంపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం పేరుతో జరిగినా.. అంతకుమించిన రహస్యమేదో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పాకిస్థాన్ ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వంపై సైన్యం పలుసార్లు తిరుగుబాటు చేసింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అన్న ప్రచారం జరుగుతోంది. దేశ పాలనా వ్యవహారాల్లో సైన్యం జోక్యాన్ని అక్కడ వ్యాపారవేత్తలు, ఆర్ధిక నిపుణులు స్వాగతించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో భద్రత విషయాలకు పరిమితమైన సైన్యం జోక్యం.. ఆర్ధిక వ్యవహారాల్లోనూ క్రమంగా పెరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందనే అభిప్రాయాన్ని కొందరు ఆర్ధిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ ప్రభుత్వాలు ఏర్పడినా ఆర్మీ కీలక పాత్ర పోషిస్తోంది. 72 ఏళ్ల స్వాతంత్ర పాక్ చరిత్రలో సగం కాలం సైనిక పాలనలో ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో చూడాలి.

Similar News