ఏపీలో కడప తర్వాత వైసీపీకి అంత బలమున్న జిల్లా నెల్లూరు. ఇప్పుడా జిల్లాలో అంతర్గత ముసలం మొదలైంది. జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యే మధ్య సఖ్యత లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. తాజాగా వెంకటాచలం MPDO సరళపై జరిగిన దాడికి.. వీళ్లిద్దరి మధ్య వివాదాలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి..
వెంకటాచలం మండలంలోని గొలగమూడి వద్ద రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బంధువులకు లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ వరకు పంచాయితీ వాటర్ పైప్‌లైన్ పొడిగించాలని.. దాని యజమాని వెంకటాచలం MPDO కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఆ మండలానికి చెందిన వైసీపీ నేత ఒకరు అనుమతి రాకుండా అడ్డుకున్నారు. ఇదంతా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తెలిసే జరిగిందన్న ప్రచారం ఉంది. తాను చెప్పినా పని జరగకపోవడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ పీక్‌స్టేజ్‌కు చేర్చింది.
కాకాణి గోవర్ధన్ రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నిర్ణయించకముందు.. కోటంరెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చింది. కాకాణికి గట్టిపోటీ ఇచ్చారాయన. అప్పటి నుంచే ఇద్దరి మధ్య విభేదాలున్నట్లు వైసీపీలో చర్చ నడుస్తోంది. ఇప్పుడు వెంకటాచలం MPDO సరళ ఇంటిపై జరిగిన దాడితో వీళ్ల వర్గపోరు రచ్చకెక్కినట్టయింది.