ఆమె సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంటికి ఎందుకు వెళ్లారు : కోటంరెడ్డి

Update: 2019-10-06 06:30 GMT

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు MLAల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎంపీడీవో ఇంటిపై దౌర్జన్యం చేశారన్న కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెరవెనుక నుంచి సర్వేపల్లి MLA కాకాని గోవర్థన్‌రెడ్డి ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందన్నారు. తనను పార్టీకి దూరం చేసే లక్ష్యంతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై సీఎం జగన్ విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జగన్ ఆదేశిస్తే.. ఇప్పుడు అంతా పక్షపాత ధోరణితో జరుగుతోందన్నారు.

నిజానికి కాకాని గోవర్థన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బంధువులే. ఐనా.. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షులుగా నిర్ణయించకముందు కోటంరెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చింది. జిల్లా అధ్యక్ష పదవి విషయంలో పోటాపోటీ రాజకీయమే నడిచింది. చివరికి కాకాని జిల్లా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని గొలగమూడిలో లేఔట్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న రచ్చకు వర్గపోరే కారణమని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బంధువు కృష్ణారెడ్డి లేఔట్‌ సర్వేపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది. టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఇది మొదలుపట్టారు. ఐతే.. వాటర్ పైప్‌లైన్ అనుమతులు అక్కడి MLA కాకాని అడ్డుకోవడం కోటంరెడ్డికి మింగుడు పడలేదు.

కడప జిల్లా తరువాత వైసీపీకి అంత బలమున్న జిల్లా నెల్లూరు. ఇప్పుడు ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు పీక్స్‌కు చేరాయి. ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరి మధ్య సఖ్యత లేదనడానికి తాజా ఘటనే ఉదాహరణ. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, రెబల్ లీడర్‌గా పేరున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య వివాదాలు ముదిరి... అనుచరులు, అధికారులపై దాడులు వరకు వెళ్ళింది. ఎంపీడీవో సరళ ఇంటిపై కోటంరెడ్డి దౌర్జన్యం, తదనంతర పరిణామాలన్నీ కూడా రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయి. తన అనుచరుడికి సంబంధించిన లేఔట్ పర్మిషన్ల విషయంలో కాకాని కావాలనే జోక్యం చేసుకున్నారని కోటంరెడ్డి అంటున్నారు. లేఔట్‌కి అనుమతులు ఇవ్వొద్దని MLA కాకాని ఆదేశించారని MPDOనే స్వయంగా తనతో అన్నారంటున్నారు. ఇదే విషయంపై కాకానితో మాట్లాడితే స్థలం వివాదంలో ఉందని చెప్తున్నారని.. కానీ నిబంధనల ప్రకారం నుడా, రెరా అనుమతులు అన్నీ సక్రమంగానే ఉందని వివరణ ఇచ్చారు. కొన్నాళ్లుగా తనను టార్గెట్ చేస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నానన్నారు.

వెంకటాచలం ఎంపిడివో సరళ అసత్య ఆరోపణలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. తాను ఇంటిపై దాడి చేశానని చెప్పినప్పుడు ఆవిడ ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలి కానీ.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీకి తనకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అది తన దురదృష్టమని కోటంరెడ్డి అన్నారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం చెబితే ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసారన్నారు. ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేసేందుకు ‌స్టేషన్‌కు వచ్చినప్పుడు కాకాణి అనుచరుడు ప్రదీప్ రెడ్డి దారుణంగా మాట్లాడినా పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తన తప్పుందని తేలితే.. షోకాజ్ నోటీసులు కూడా అక్కర్లేదని, శాశ్వతంగా వైసీపీ నుంచి బహిష్కరించొచ్చని అన్నారు.

Similar News