తిరుమల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం వాహనసేవలో విహరించి భక్తులకు అభయప్రదానం చేసిన శ్రీవారి వేడుకలు ముగిశాయి. ఉదయం చక్రస్నానం నిర్వహించిన వేదపండితులు.. సాయంత్రం ధ్వజావరోహణం పూర్తిచేశారు.
బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ.. ధ్వజస్తంభానికి ఎగురవేసిన గరుడధ్వజాన్ని అవరోహణ చేసి.. ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయని తెలియజేశారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే.. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఏడాది తర్వాతే వస్తాయి. ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించిన వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అంతకు ముందు మలయప్ప స్వామికి చక్రస్నాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మొదట స్వామివారికి తిరుచ్చి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఆ తర్వాత వరాహ స్వామి ఆలయ ముఖ మంటపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి, సుదర్శన చక్రతళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారిని వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉన్న పుష్కరిణికి తీసుకొచ్చారు. మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఉత్సవమూర్తులకు, సుదర్శన చక్ర తాళ్వారుకు తర్వాత ప్రత్యేక అభిషేకాలు జరిగాయి.
బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానానికి అత్యంత ప్రాధాన్యముంది. 8 రోజులు వాహన సేవల్లో అలసిన వెంకన్నకు చివరిరోజు చక్రస్నానం చేయించడం ఆనవాయితీ. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నానంతో స్వామివారి పుష్కరిణిలో జలాలు మరింత పవిత్రంగా మారుతాయని నమ్మకం. అంతేకాదు చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి తిరుమల శేషగిరులలో వెలసి ఉన్న 66 కోట్ల పుణ్యతీర్ధ స్నానఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఘట్టంలో పాల్గొనడానికి భక్తులు పోటీపడ్డారు. చక్రస్నానం అనంతరం కోనేటిలో పుణ్యాస్నానాలు ఆచరించి తరించారు. చక్రస్నానాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో స్వామివారి పుష్కరిణి పరిసరాలు కిక్కిరిశాయి. గోవింద నామస్మరణ చేయడంతో తిరుమల గిరులు మార్మోగాయి.
బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేసిన టీటీడీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 8 రోజుల్లో 7.07 లక్షల మందికి దర్శన భాగ్యం కల్పించినట్లు చెప్పారు. ఒక్క గరుడ సేవ రోజే 92వేల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు ఈవో చెప్పారు. హుండీ ద్వారా 20.40 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
అటు వాహన సేవలు, రథోత్సవం, చక్రస్నానం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.. చిన్న చిన్న ఇబ్బందులు మినహా బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో అటు టీటీడీ అధికారులు, ఇటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.