వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేడంలో మరింత స్పీడ్ పెంచింది టీడీపీ. ఇసుక కొరతకు వ్యతిరేకంగా నేతలు పోరు బాట పట్టారు. ఈనెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ బలోపేతం , వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ఆగడాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. నియోజకవర్గాల వారిగా నెలకొన్న తాజా పరిస్థితులపై లోతుగా సమీక్షించనున్నారు. అటు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు తెలుగు తమ్ముళ్లు. బోటు ప్రమాద ఘటనలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోతే సీఎం జగన్ కనీసం రివ్యూ చేయలేదన్నారు. చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం మంత్రులతో ఎదురుదాడి చేయిస్తోందని ఆరోపించారు కళా వెంకట్రావు.
కృత్రిమ ఇసుక కొరతకు నిరసనగా దీక్ష చేపట్టారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్త విధానం పేరుతో... ఇసుకను ప్రభుత్వం మాఫియా చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. టీడీపీ నాయకులు, భవన నిర్మాణ రంగ కార్మికులు ఆయనకు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపచేశారు.
అటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో MLA రామానాయుడు నిరసన తెలిపారు. పట్టణంలో పారిశుద్యం సరిగా లేకపోవడం, విద్యుత్ కష్టాలు, మంటినీటి సరఫరాలో లోపాలపై ఫిర్యాదులు చేస్తే పట్టించకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్ తీసుకొచ్చిందని మాజీ మంత్రి యనమల విమర్శలు గుప్పించారు.. గవర్నమెంట్ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు.
గత ప్రభుత్వం వల్లే ఆర్థిక వ్యవస్థ బాగా లేదని మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నారు మాజీ మంత్రి జవహర్ . వైసీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను టీడీపీపై గెంటే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇసుకను విశాఖకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. . ప్రభుత్వం టీవీ5, ఏబీఎన్ ఛానల్‌ను నియంత్రిస్తోందని మండిపడ్డారు.
ఇసుక మాఫియాకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి . ఇసుక తవ్వకాలకు అడ్డువస్తే అంతం చేసే స్థాయిలో మాఫియా పెరిగిపోయిందన్నారు. వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వాప్తంగా జగన్ సర్కార్ తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.