నెదర్లాండ్స్ రాజు, రాణితో మోదీ‌ విస్తృత చర్చలు

Update: 2019-10-15 01:31 GMT

భారత్‌లో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ రాజు విలియమ్ అలెగ్జాండర్, రాణి మాగ్జిమాతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. 2013లో నెదర్లాండ్స్ రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలెగ్జాండర్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థితిగతులను సమీక్షించడంతోపాటు మరింతగా ఇతర రంగాలకు సహకారాన్ని విస్తరించుకునే అంశంపైన నెదర్లాండ్స్ రాజు దంపతులతో మోదీ చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి.

అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో రాజ దంపతులకు సాంప్రదాయక స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ రాజ దంపతులకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యాలు గణనీయంగా పెరిగాయి. 2018-19 లో ద్వైపాక్షిక వాణిజ్య టర్నోవర్ 12.87 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్‌లో అత్యధిక స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్‌కు ఐదో స్థానం ఉంది. అలాగే ఈ ఐరోపా దేశంలో 2.35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.

మరోవైపు భారత్ పర్యటనలో భాగంగా విలయమ్‌ అలెగ్జాండర్‌, మాగ్జిమా దంపతులు ముంబై, కొచ్చిని సందర్శిస్తారు. మంగళవారం 25వ టెక్నాలజీ శిఖరాగ్ర ప్రారంభ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు దాదాపు 140 మంది నెదర్లాండ్స్ పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు.

Similar News