ఆ లంగర్‌లో లాజిక్ ఏంటి?

Update: 2019-10-17 07:09 GMT

సెప్టెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గి, వాతావరణం అనుకూలించడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం మరోసారి బోటు వెలికితీత పనులు చేపట్టింది.

గత నెల రోజుల నుంచి అనేకసార్లు బోటును బయటకు తీసేందుకు అటు సహాయక బృందాలు, ప్రభుత్వం, ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గత నెల 23వ తేదీ వరకూ ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీతకు ప్రయత్నించి చేతులెత్తేసింది. ఆ తర్వాత 30న మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈనెల మూడో తేదీ వరకూ కొనసాగించింది. నదిలో వరద ఉధృతి కారణంగా గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవడంతో ఇప్పటివరకూ బ్రేక్ ఇచ్చారు. వరద పోటు తగ్గడంతో మూడోసారి బోటు వెలికితీత పనులను చేపట్టింది ధర్మాడి బృందం. పొక్లెయినర్‌, ఇనుప తాళ్లు, ఇతర సామగ్రితో ధర్మాడి బృందం మంగళవారం నుంచి సంప్రదాయ పద్ధతుల్లోనే ఆపరేషన్ కొనసాగిస్తోంది.

బోటు పైకి తీయడానికి గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఇనుప తాడును వృత్తాకారంలో నదిలో వేసి.. వాటి కొసలను ఒడ్డున ఉన్న పొక్లెయిన్‌తో లాగడం ద్వారా గాలింపు చేపడుతున్నారు. ఒకవేళ ఏదైనా తగిలినట్టు అనిపిస్తే.. లంగరు వేసి దాన్ని ఒడ్డుకు లాగుతారు. ఇందుకోసం దాదాపు 1000 మీటర్ల తాడును ఉపయోగిస్తోంది ధర్మాడి బృందం.

నదిలో 150 అడుగుల లోతులో, ఇసుకలో కూరుకుపోయిన స్థితిలో బోటు ఉన్నట్టు ధర్మాడి టీమ్ గుర్తించింది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొంత మేర కిందకు కొట్టుకు వెళ్లినట్టుగా నిర్థారణ అవడంతో.. ప్రస్తుతం బోటు ఉందని అంచనా వేస్తున్న చోట 3 లంగర్లను వదిలి గాలిస్తున్నారు.

150 అడుగుల లోతులో బోటు ఉన్నందున గజ ఈతగాళ్లను పంపి లంగరు వేయిస్తే ఫలితం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఐతే.. ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి కావాల్సి ఉంది. విశాఖపట్నానికి చెందిన ఎక్స్‌పర్ట్స్ వస్తే.. అతనికి ఆక్సిజన్ మాస్క్‌తోపాటు ఇతర భద్రతా ఏర్పాట్లన్నీ చేసి నీళ్లలోకి పంపాలనుకుంటున్నారు. ఐతే, కలెక్టర్ ఆదేశాలు వచ్చే వరకూ ప్రస్తుతం గాలిస్తున్న తీరులోనే సెర్చింగ్ కొనసాగించనున్నారు.

Full View

ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి బాగా తగ్గింది. సహాయ చర్యలకు కాస్త అనుకూలంగానే వాతావరణం ఉంది. దీన్ని ఉపయోగించుకుని పడవను పైకి లాగేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ లంగరుతోపాటు 3 వేల అడుగుల ఇనుప తాడును, ఒక వెయ్యి మీటర్ల నైలాన్ తాడును కూడా ఇందుకోసం వాడుతున్నారు. బుధవారం గాలింపు కొనసాగిస్తున్నప్పుడు లంగరుకు చిక్కినట్టే చిక్కి మిస్సయింది. ఆ సమయంలో నీళ్లపైకి తెల్లని రంగు తేలిందని ధర్మాడి సత్యం చెప్తున్నారు. అది లంగరుకు బోటు తగులుకున్న కారణంగా పెయింట్ ఊడడం వల్లే జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈసారి లంగరుకు బలమైన ఐరన్‌ రోప్‌ను జోడించి.. బోటును బయటకు తీస్తామంటున్నారు. గతంలో కూడా ఇదే దశలో రోప్‌ తెగిపోవడంతో.. ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఏదైమైనా గతంతో పోలిస్తే బోటు మునిగిన ప్రాంతాన్ని, అది ఉన్న లోతును కచ్చితంగా అంచనా వేసినందున.. వీలైనంత త్వరగా దాన్ని ఒడ్డుకు లాక్కొస్తామంటున్నారు.

గతంలో చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడం.. ఇనుప రోప్ తెగిపోవడం వంటి అనుభవాల దృష్ట్యా.. ఈసారి మరింత పకడ్బందీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించనుంది సత్యం బృందం. కచ్చులూరులో బోటు మునిగిన ప్రాంతంలో గతంలోనూ ఉదయభాస్కర్ అనే పడవ మునిగి 60 మంది జలసమాధి అయ్యారు. అయితే దాన్ని ఇంతవరకు బయటకు తీయకపోవడం గమనార్హం. ఇప్పుడు రాయల్ వశిష్టను కూడా బయటకు తీయగలరా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.

Similar News