గోదావరిలో ఆపరేషన్ వశిష్ట కొలిక్కివస్తోంది. కచ్చులూరు వద్ద మునిగిపోయిన బోటును పైకి తీసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోంది. నిన్న లంగరు వేసి బోటును పైకిలాగేప్పుడు.. ధర్మాడి సత్యం టీమ్ దాదాపు సక్సెస్ అయ్యింది. ఐతే.. దాదాపు 12 అడుగుల మేర తీరంవైపు బోటును లాగిన తర్వాత.. పడవ రెయిలింగ్ ఊడి వచ్చేయడంతో ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. పోర్టు అధికారి ఆదినారాయణ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. శుక్రవారం ఎట్టిపరిస్థితుల్లో పైకి తీస్తామని ధీమాగా ఉన్నారు.
బోటు మునిగిన ప్రాంతం, ఉన్న లోతుపై స్పష్టమైన అంచనా వచ్చిన నేపథ్యంలో.. ఆపరేషన్ స్పీడ్ అందుకుంది. భారీ లంగర్‌లు, ఇనుప తాళ్ల సాయంతో దాన్ని ఒడ్డుకు లాగేందుకు దాదాపు 50 మంది తీవ్రంగా కష్టపడుతున్నారు. గురువారం గాలింపు చర్యల సమయంలో బోటు లాగేప్పుడు డీజిల్ తెట్టు పైకి వచ్చిందని ధర్మాడి సత్యం తెలిపారు. అలాగే గాలి బుడగలు కూడా పైకి వస్తున్నాయన్నారు. నదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడం, వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉండడంతో ఆపరేషన్ పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.