ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఘాటు విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తాను కోర్టుకు హాజరయితే... 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం హాస్యాస్పదం అన్నారాయన. జార్ఖండ్‌లో శిబూసోరెన్ సీఎంగా ఉన్నప్పుడు కోర్టుకు హాజరయ్యేవారని యనమల గుర్తుచేశారు. జగన్‌పై ఉన్న కేసులు.. ఆయన పవర్‌లో లేనప్పుడు నమోదైనవని.. వాటి కోర్టు ఖర్చులన్నీ సొంతంగానే పెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేసులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని.. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు గతంలోనే సీబీఐ కోర్టు, హైకోర్టు తిరస్కరించాయని గుర్తుచేశారు.
ఇప్పుడు జగన్ సీఎం అయిన నేపథ్యంలో.. ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని యనమల అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో హాజరుకు మినహాయింపు అడగడం వెనుకు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజాధనం వృధా వంకతో కోర్టు వాయిదాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు యనమల. ప్రజాధనంపై శ్రద్ధ ఉంటే.. పెద్దసంఖ్యలో సలహాదారులను ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. వారికి జీతభత్యాల రూపంలో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు యనమల రామకృష్ణుడు.